కరంటోళ్లకు కంగ్రాట్స్…KCR
-డిమాండ్ తగ్గినా గ్రిడ్ సురక్షితం
-1500 మెగావాట్లు పడిపోయిన డిమాండ్
-అయినప్పటికీ వ్యూహాత్మకంగా బ్యాలెన్స్
-విద్యుత్‌శాఖకు సీఎం శ్రీ కేసీఆర్ అభినందన
కరోనా వైరస్‌పై పోరుకు సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి లైట్లు ఆర్పేసినా విద్యుత్‌కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండాచేసిన విద్యుత్‌శాఖను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభినందించారు. అంచనావేసిన దానికన్నా భారీగా డిమాండ్ పడిపోయినప్పటికీ, వ్యూహాత్మకంగా బ్యాలెన్స్‌చేయగలిగారని జెన్‌కో-ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుతోపాటు ఇతర డైరెక్టర్లు, ఇంజినీర్లకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు.
సమతూకం సాధించడంలో విజయం
రాష్ట్రంలో ఆదివారం రాత్రి 9 గంటలకు ఒకేసారి విద్యుత్ దీపాలు ఆర్పేసినప్పటికీ విద్యుత్‌శాఖ పక్కావ్యూహంతో వ్యవహరించడంతో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది రాలేదు. విద్యుత్ వినియోగంలో ఒకేసారి భారీ మార్పులు సంభవించినప్పటికీ ఉత్పత్తి-సరఫరా మధ్య పూర్తిస్థాయి సమతూకాన్ని సాధించడంలో జెన్‌కో, ట్రాన్స్‌కో విజయం సాధించాయి. విద్యుత్ గ్రిడ్‌కు ఎలాంటి నష్టం కలుగకుండా చూసేందుకు విద్యుత్ సంస్థల సీఎండీ ప్రభాకర్‌రావు ఆదివారం ఉదయం నుంచి విద్యుత్‌సౌధలోని స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్‌ఎల్డీసీ) లోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. రాత్రి 9 గంటల వరకు 7,300 మెగావాట్లున్న విద్యుత్ డిమాండ్.. తర్వాత ఒక్కసారిగా లైట్లు ఆర్పివేయడంతో 5,800 మెగావాట్లకు పడిపోయింది. తగ్గిన 1,500 మెగావాట్ల డిమాండ్‌ను మెయిన్‌టెయిన్ చేసేందుకు నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్ల వద్ద రివర్స్ పంపింగ్ నిర్వహించారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పరిధిలో 120 మెగావాట్ల సామర్థ్యంతో పంపింగ్ కొనసాగించారు. రాత్రి 9 గంటల 9 నిమిషాల తర్వాత రాష్ట్ర ప్రజలంతా మళ్లీ విద్యుత్ దీపాలను వెలిగించగానే రివర్స్ పంపింగ్‌ను నిలిపివేశారు. దీంతో గ్రిడ్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. ఈ ప్రక్రియను ట్రాన్స్‌కో డైరెక్టర్లు టీ నర్సింగ్‌రావు, జగత్‌రెడ్డి, సూర్యప్రకాశ్, జెన్‌కో డైరెక్టర్లు సచ్చిదానందం, లక్ష్మయ్య పర్యవేక్షించారు. దీపజ్వలనకు ముందు దేశవ్యాప్తంగా 1,17,300 మెగావాట్లుగా ఉన్న విద్యుత్ డిమాండ్ ఆదివారం రాత్రి 9 గంటల తర్వాత 85,300 మెగావాట్లకు పడిపోయింది. దీంతో విద్యుత్ ఫ్రీక్వెన్సీని 49.7 హెర్ట్ నుంచి 50.26 హెర్ట్ మధ్య కొనసాగించడంతో దేశవ్యాప్తంగా పవర్‌గ్రిడ్‌లకు ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు.