ఆర్థిక ప్రగతి కన్నా ప్రజల ప్రాణాలే ప్రాధాన్యం: మంత్రి శ్రీ కేటీఆర్


ఆర్థిక ప్రగతి కన్నా ప్రజల ప్రాణాలే తమకు ముఖ్యమని అదే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. కరోనా వైరస్‌ కట్టడికి లాక్‌డౌన్‌ కొనసాగింపే సరైన చర్యని ఆయన పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ… కరోనా వ్యాప్తి ఆగిన తర్వాతే లాక్‌డౌన్‌ ఎత్తేయాలని అభిప్రాయపడ్డారు. కరోనాను అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఎదుర్కోలేకపోతున్నాయన్నారు. ఇప్పుడు పొరపాటు చేస్తే భవిష్యత్‌లో మనల్ని మనం క్షమించుకోలేమన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టడమే మన ముందున్న ఏకైక పరిష్కారం అన్నారు. దీనికి భౌతిక దూరం పాటించడమొక్కటే మార్గమన్నారు. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో అందరికీ పరీక్షల నిర్వహణ ఆచరణ సాధ్యం కాదన్నారు. విచ్చలవిడిగా పరీక్షలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదన్నారు. హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో కరోనా పరీక్షల సామర్థ్యాన్ని మరింత పెంచాల్సి ఉందన్నారు. విచ్చలవిడిగా పరీక్షలు చేస్తే అసలైన రోగులకు అవకాశం ఉండకపోవచ్చన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందన్నారు. అవసరమైన సౌకర్యాలు, వైద్య సామాగ్రిని సిద్ధం చేసినట్లు తెలిపారు.

15 వేల పడకలు సిద్ధం…

మూడు దశల్లో కరోనాను ఎదుర్కొవడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. నూతన ఐసోలేషన్‌ వార్డులు, వైద్య సామాగ్రిని సిద్ధం చేయడం, పీపీఈలు, మాస్కులు మరిన్ని ఆస్పత్రుల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో 15 వేల పడకలను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. అవసరమైతే ప్రైవేట్‌ వైద్య కళాశాలలు సిద్ధంగా ఉన్నాయన్నారు.

ఆకలి చావు లేకుండా చూడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం…

లాక్‌డౌన్‌లో నేపథ్యంలో రాష్ట్రంలో ఒక్క ఆకలి చావు లేకుండా చూడాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. మధ్యతరగతి, పేదల సమస్యలను పరిగణలోకి తీసుకుని పనిచేస్తున్నట్లు చెప్పారు. పేదలు, వలస కార్మికుల సంక్షేమంలో తెలంగాణ మార్గదర్శిగా ఉందన్నారు. పేదలు, కూలీలను ప్రభుత్వం ఆదుకుంటున్నట్లు తెలిపారు. ఇంటి అద్దెల కోసం బలవంతపెట్టకుండా మార్గదర్శకాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

లాక్‌డౌన్‌ ద్వారానే కరోనాను ఎదుర్కొవచ్చని సీఎం అభిప్రాయపడుతున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. ప్రపంచంలో ఏ ప్రాంతం కూడా కరోనాను ఎదుర్కొనే పరిస్థితిలో లేదన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు సైతం కరోనాను ఎదుర్కోలేకపోతున్నాయన్నారు. జూన్‌ తొలివారంలో కరోనా వ్యాప్తిలో దేశం శిఖరాగ్రస్థాయికి చేరుకుంటుందని నివేదికలు చెబుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడం భారత్‌కు సాధ్యం కాదన్న ఉద్దేశ్యంతో సీఎం ఉన్నారన్నారు. లాక్‌డౌన్‌ ద్వారానే కరోనాను ఎదుర్కొవచ్చని సీఎం అభిప్రాయం అన్నారు. పరిశ్రమలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేట్‌ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలని సంస్థలకు సూచించినట్లు చెప్పారు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటే ఇప్పటికంటే ఎక్కువ కష్టపడి ప్రగతి సాధించొచ్చని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

About The Author