సైకిల్‌పై ఏడు రోజులు.. 1,700 కి.మీ..


స్వస్థలానికి చేరుకున్న ఒడిశా యువ కార్మికుడు
ఇంటర్నెట్‌ డెస్క్‌: లాక్‌డౌన్‌ కారణంగా పనిచేసే పరిశ్రమ మూతబడింది. మూడు నెలల వరకు ఇదే పరిస్థితి ఉంటుందని విన్నాడు. ఇంటికి వెళ్దామంటే.. ప్రజారవాణా స్తంభించింది. అయినా ఎలాగైనా సొంత ఊరికి చేరుకోవాలన్న మొండి పట్టుదలతో ఓ యువ కార్మికుడు.. వంద కాదు.. రెండొందలు కాదు.. ఏకంగా 1,700 కిలోమీటర్లు ప్రయాణించాడు. అదీ సైకిల్‌ తొక్కుకుంటూ. చేతిలో మ్యాప్‌ లేకున్నా.. గుర్తున్న ప్రధాన రైల్వేస్టేషన్ల ఆధారంగా స్వస్థలానికి చేరుకున్నాడు. అతనే ఒడిశాలోని జాజ్‌పూర్‌ జిల్లాకు చెందిన మహేశ్‌ జినా. 
రోజుకు 16 గంటల ప్రయాణం..
మహారాష్ట్ర సాంగ్లీ మిరాజ్‌లోని ఓ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్న మహేశ్‌.. లాక్‌డౌన్ సమయంలో అక్కడే ఖాళీగా ఉంటే ఖర్చవుతుందని భావించాడు. రూ.3 వేలు, ఒక సైకిల్‌తో ఇంటి బాట పట్టాడు. సైకిల్‌పై అంతదూరం ప్రయాణం సాధ్యం కాదని తోటివారు చెప్పినా.. పట్టువిడవకుండా ఏప్రిల్‌ 1న అక్కడినుంచి బయల్దేరాడు. రోజుకు 16 గంటలు.. దాదాపు 200 కి.మీ సైకిల్‌ తొక్కుతూ.. శోలాపూర్‌, హైదరాబాద్‌, విజయవాడ, శ్రీకాకుళం మీదుగా ఒడిశాకు చేరుకున్నట్లు మహేశ్‌ తెలిపాడు. ‘తెల్లవారుజామునే ప్రయాణం మొదలుపెట్టేవాడిని. వేడి వాతావరణం ఇబ్బంది పెట్టినా.. వెనుకాడలేదు. రాత్రుళ్లు గుళ్లు, పాఠశాలల్లో నిద్రపోయేవాడిని. రోడ్ల పక్కన దాబాల్లో పొట్ట నింపుకొనేవాడిని. మధ్యలో కొందరు లారీ డ్రైవర్లు నాకు అండగా నిలిచారు’ అని వివరించాడు. మహారాష్ట్ర సరిహద్దులో పోలీసులు ఆపినప్పడు నా సైకిల్‌ ప్రయాణం గురించి ఆసక్తికర అంశాలను వారికి వివరించి బయటపడ్డానని చెప్పుకొచ్చాడు. ఏప్రిల్‌ 7వ తేదీన సాయంత్రం ఇంటికి చేరుకున్న అతన్ని అధికారులు స్థానికంగా ఓ పాఠశాలలో క్వారంటైన్‌ చేశారు. ఈ కేంద్రంలో ఒంటరిగా ఉండటం కన్నా సైకిల్‌ ప్రయాణమే బాగుందని మహేశ్‌ పేర్కొనడం గమనార్హం.

About The Author