ఎంతమందికైనా చికిత్స చేసేందుకు తెలంగాణ సిద్ధం : సీఎం శ్రీ కేసీఆర్‌


కరోనాపై యుద్ధానికి తెలంగాణ ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని.. ఎంతమంది రోగులకైనా చికిత్స చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావు తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్‌ అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ… ఎంతమందికైనా కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వైరస్‌ నిర్దారిత పరీక్షలు నిర్వహించడానికి కావాల్సిన టెస్ట్‌ కిట్స్‌ అన్నీ సిద్ధంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో పీపీఈ కిట్లకు ఏమాత్రం కొరతలేదన్నారు. ఇప్పటికే 2.25 లక్షల పీపీఈ కిట్లు ఉన్నాయి. ఈ సంఖ్య కొద్ది రోజుల్లోనే 5 లక్షలకు చేరుకుంటుంది. మరో 5 లక్షల పీపీఈ కిట్లకు ఆర్డర్‌ ఇచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రస్తుతం 3.25 లక్షల ఎన్‌ 95 మాస్కులున్నాయి. త్వరలోనే ఈ సంఖ్య 5 లక్షలకు చేరుకుంటుంది. మరో 5 లక్షల ఎన్‌95 మాస్కులకు ఆర్డర్‌ ఇచ్చినట్లు సీఎం వెల్లడించారు. వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలు, డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది, ఆస్పత్రులు, బెడ్స్‌ అన్నీ సిద్ధంగా ఉన్నాయన్నారు. ఇప్పటికే 20 వేల బెడ్స్‌ సిద్ధంగా ఉన్నాయన్నారు. లక్ష మంది పేషెంట్లు అయినా సరే చికిత్స చేయడానికి అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం చేసిందన్నారు.

ఈ నెల 20 వరకు యధావిధిగా లాక్‌డౌన్‌ కొనసాగుతుందన్నారు. తర్వాత పరిస్థితిని బట్టి మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉందన్నారు సీఎం కేసీఆర్‌. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలు కొనసాగనున్నట్లు తెలిపారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలకు, వలస కూలీలకు సాయంలో ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని కోరారు. ప్రజల సహకారం ఇదేవిధంగా కొనసాగాలని సీఎం ఆకాంక్షించారు. కరోనా వైరస్‌ సోకిన వారి ఆధారంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 259 కంటైన్మెంట్లు ఏర్పాటు చేసి వైరస్‌ వ్యాప్తి జరగకుండా గట్టి ప్రయత్నాలు చేపట్టినట్లు సీఎం పేర్కొన్నారు.

About The Author