మటన్ లో బీఫ్ కలిపి అమ్ముతున్న మాఫియా ..


మటన్ లో బీఫ్ కలిపి అమ్ముతున్న మాఫియా .. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న జీహెచ్ఎంసీ అధికారులు

జోరుగా మటన్ కల్తీ ..హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో జోరుగా సాగుతున్న దందా
హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో మటన్ అమ్ముతున్న దుకాణాల్లో నిర్వహించిన తనిఖీల్లో కళ్ళు బైర్లు గమ్మే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి . మాంసం అమ్మకాలు, అక్రమాలు, అధిక ధరలపై పరిశీలన కోసం పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డా.బాబు బేరి నేతృత్వంలో ఏర్పాటు చేసిన వెటర్నరీ అధికారుల కమిటీ మూడు రోజులుగా జీహెచ్‌ఎంసీలో విస్తృత తనిఖీలు చేస్తోంది. ఇక ఈ తనిఖీలలో హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో ఈ దందా సాగుతున్నట్టు గుర్తించారు. బార్కాస్‌, మణికొండ, అసిఫ్ నగర్‌, జియాగూడ, గోల్కొండ,అంబర్‌పేట్‌, నాంపల్లి, రెడ్‌హిల్స్‌, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్‌, ఉప్పల్‌, అమీర్‌పేట్‌ తదితర ప్రాంతాల్లోని పలు మటన్‌ దుకాణాల్లో గొడ్డు మాంసం మటన్ లో కలిపి విక్రయిస్తున్నట్టు గుర్తించారు.

మటన్ ధర విపరీతంగా ఉన్న నేపధ్యంలో అక్రమ సంపాదనకు తెరతీసిన వ్యాపారులు కొందరు ఎలాంటి లైసెన్స్ లేకుండానే మటన్ విక్రయాలు చేస్తున్నారు.హైదరాబాద్ కేంద్రంగా తనిఖీలు చేసిన అధికారులు మొత్తం 62 దుకాణాలు తనిఖీ చేస్తే 50 దుకాణాలకు లైసెన్స్ లేదు. ఇక కొన్ని చోట్ల చికెన్ వ్యాపారులే మటన్ అమ్ముతున్నట్టు గుర్తించారు అధికారులు . కరోనా సమయంలో పౌష్టికాహారం తినాలని చెప్తున్న నేపధ్యంలో నిన్నా మొన్నటి దాకా మాంసాహారం అంటే ఆమడ దూరం పారిపోయిన వాళ్ళు ఒక్కసారిగా మాంసాహారం కోసం ఎగబడుతున్నారు .

నిబంధనలు ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడే వారిపై కొరడా
చాలా చోట్ల నిబంధనలను తుంగలో తొక్కుతున్న వారిపై కొరడా ఝుళిపిస్తున్నారు . ఇక మటన్‌లో బీఫ్‌ కలుపుతున్నట్లు తాజా తనిఖీల్లో తేలటంతో ఆ వ్యాపారులను గుర్తించి టాస్క్‌ఫోర్స్‌కు అప్పగిస్తున్నారు .

About The Author