నా భర్తకు సముచిత అంత్యక్రియల జరగాలి.. కోర్టుకైనా వెళతా: చెన్నై డాక్టర్ భార్య


నా భర్తకు సముచిత అంత్యక్రియల జరగాలి.. కోర్టుకైనా వెళతా: చెన్నై డాక్టర్ భార్య దేశం కోసం ప్రాణాలను అర్పించిన తన భర్తకు అదే స్థాయిలో గౌరవంగా అంత్యక్రియలు జరగాలని, దానికోసం అవసరమైతే కోర్టుకైనా వెళతానంటూ చెన్నైలో ఇటీవల మరణించిన డాక్టర్ సైమన్ హెర్క్యులస్ భార్య పేర్కొన్నారు. కరోనా రోగులకు చికిత్స అందించేందుకు అహర్నిశలు శ్రమించి, చివరకు ఆ మహమ్మారి బారినే పడి సైమన్‌ మరణించారు. దీంతో ఆయనకు తోటి డాక్టరే అంత్యక్రియలు నిర్వహించారు. దీనిపై సైమన్ భార్య ఆనంది హెర్కులస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భర్త అంత్యక్రియలు జరిగిన విధానం తనకు చాలా బాధ కలిగించిందని, ఆయనకు గౌరవ మద్యాదలతో, సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరగాలని కోరారు. ఈ మేరకు సీఎం ఎడప్పాడి పళనిస్వామికి విజ్ఞప్తి చేశారు. దీనిపై చెన్నై కార్పొరేషన్ కమిషనర్ స్పందించారు. కరోనాతో మృతి చెందిన డాక్టర్ అవశేషాలను ఇప్పుడు మళ్లీ వెలికితీయడం ఏమంత సురక్షితం కాదని స్పష్టం చేశారు. అయితే తాను ఈ విషయాన్ని వదిలిపెట్టనని, కోర్టుకైనా వెళతానని ఆనంది తెలిపారు. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం మృతశరీరంలో వైరస్ జీవించేది మూడు గంటలేనని, దీని ప్రకారం వేలంగాడు శ్మశానవాటికలో ఖననం చేసిన తన భర్త మృతదేహాన్ని వెలికి తీసి కీల్పాక్ శ్మశానవాటికలో గౌరవప్రదంగా ఖననం చేయాలని ఆనంది కోరారు.

About The Author