ప్ర‌జ‌ల ప్రాణాలు నిల‌ప‌డంలో వైద్యులు అద్భుత‌మైన సేవ‌లు…ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్


ప్ర‌జ‌ల ప్రాణాలు నిల‌ప‌డంలో వైద్యులు అద్భుత‌మైన సేవ‌లు అందిస్తున్నార‌ని, క‌రోనా క‌ష్ట కాలంలోనూ, ప్రాణాల‌కు తెగించి వాళ్ళు అందిస్తున్న సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌ని, మ‌నం చేయాల్సిందల్లా వాళ్ళ‌కు స‌హ‌క‌రించ‌డ‌మేన‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖా మాత్యులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, గిరిజ‌న సంక్షేమ‌, స్త్రీ, శిశు సంక్షేమ‌శాఖా మాత్యులు స‌త్య‌వ‌తి రాథోడ్ లు అన్నారు. మ‌హ‌బూబాబాద్ జిల్లా (ఏరియా) ద‌వాఖానాలో డాక్ట‌ర్లకు పిపిఇ కిట్ల‌ను, మాస్కుల‌ను మంత్రులు అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ, కరోనా వైర‌స్ మొత్తం ప్ర‌పంచాన్నే గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న‌ది. ఈ ద‌శ‌లోనూ మ‌న ముఖ్య‌మంత్రి కెసిఆర్ గారు, సాహ‌సంతో, ఆర్థిక న‌ష్టాల‌ను సైతం లెక్క చేయ‌కుండా, ప్ర‌జ‌ల ప్రాణాలే ముఖ్య‌మ‌ని లాక్ డౌన్ ని కొన‌సాగిస్తున్నార‌న్నారు. లాక్ డౌన్ ని కొన‌సాగించ‌ని దేశాల్లోనే కుప్ప‌లు తెప్ప‌లుగా మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయ‌న్నారు. కెసిఆర్ ముందు చూపు కార‌ణంగా మిగ‌తా దేశాల‌కంటే, దేశంలోనే మిగ‌తా రాష్ట్రాల కంటే కూడా మ‌నం ఎంతో మెరుగ్గా ఉన్నామ‌ని మంత్రులు చెప్పారు. వైద్యులు, సిబ్బంది, అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది ప్రాణాల‌ను ఫ‌ణంగా పెట్టి ప‌ని చేస్తున్నందుననే మ‌నం మంచి స్థితిలో ఉన్నామ‌న్నారు. మ‌నం చేయాల్సిందల్లా వాళ్ళ‌కు స‌హ‌క‌రించ‌డ‌మేన‌న్నారు. మ‌రికొంత కాలం సంయ‌మ‌నం పాటిస్తూ, లాక్ డౌన్ నిర్వహించుకోవాల‌ని, ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ కంట్రోల్ లో ఉంద‌ని తెలిపారు.
మ‌హ‌బూబాబాద్ జిల్లా హాస్పిట‌ల్ అభివృద్ధికి స‌హ‌క‌రిస్తామ‌ని హామీ ఇచ్చారు. త‌న నిధుల నుంచి రూ.80ల‌క్ష‌ల‌ను కేవ‌లం మ‌హ‌బూబాబాద్ హాస్పిట‌ల్ అభివృద్ధికే ఇచ్చిన ఎంపీ మాలోతు క‌విత‌ను మంత్రులిద్ద‌రూ అభినందించారు. ఈ కార్య‌క్ర‌మంలో మ‌హ‌బూబాబాద్ జెడ్పి చైర్మన్ బిందు, ఎంపి కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ, మున్సిపల్ చైర్మన్ డా. రామ్ మోహన్ రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

About The Author