సీఎం కేసీఆర్ కు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ…


వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి ఐకేపీ సెంటర్లలో రైతులను ఇబ్బంది పెడుతున్నఅధికారులు తడిచిన ధాన్యాన్ని మద్ధతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలి అత్త సొమ్ముతో అల్లుడి సోకు అన్నట్లు కేసీఆర్ ప్రచారం డిమాండ్లు పరిష్కరించకపోతే ప్రత్యక్ష కార్యచరణ మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి రాష్ట్రంలో రైతాంగ సమస్యలు ఎక్కువయ్యాయని మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. అత్త సొమ్ముతో అల్లుడి సోకు అన్నట్టు రాష్ట్రంలో రైతన్న కష్టాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకోవడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని రేవంత్ అన్నారు. రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ ఎంపీ రేవంత్ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. కొద్ది రోజులుగా మీరు పడుతోన్న తాపత్రయం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. కర్షకుడి కష్టాన్ని మీ ఘనతగా ప్రచారం చేసుకోవడానికి సిగ్గుండాలి! రైతు కష్టం, ప్రకృతి దయ వల్ల పంట దిగుబడి అధికంగా వచ్చింది. రైతు కళ్లలో ఆనందం వెల్లి విరియాల్సిన ఈ సమయంలో మీ నిర్లక్ష్యం కారణంగా ఆవేదన తొణికిసలాడుతోంది. క్షేత్రంలో రైతు కష్టం-నష్టం మీ కంటికి కనిపించడం లేదు, చెవికి వినిపించడం లేదు. మీరొక ఊహా ప్రపంచంలో విహరిస్తూ.. ప్రజలంతా అలాగే విహరించాలని కోరుకుంటున్నారు. యాసంగి దిగుబడి బాగా వచ్చిందని, ప్రతి కిలో ప్రభుత్వమే కొంటుందని కొద్ది రోజుల క్రితం మీడియా సమావేశంలో మీరు చెప్పారు. దీని కోసం రూ.30 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు క్షేత్రంలో చూస్తే రైతులలో దుఖం ఉప్పొంగుతోంది. ధాన్యాన్ని నడిరోడ్డుపై పోసి నిప్పుపెట్టుకుంటోన్న నిస్సహాయత కనిపిస్తోంది. పురుగుమందు డబ్బాలతో కొనుగోలు కేంద్రాల్లో నిరసన దృశ్యాలు కనిపిస్తున్నాయి. తమ కష్టాన్ని దళారీలు దోచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలదన్నట్టు అకాల వర్షంతో వచ్చిన అనుకోని నష్టం రైతుల కంట కన్నీరు పెట్టిస్తోంది. ఇటువంటి కష్టసమయంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. ఆర్బాటపు ప్రకటనలతో సరిపెడుతోంది. మీకు తెలియకపోతే కొన్ని ఉదాహరణలు చెప్తాను. రైతన్న బాగుకోరి ఈ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నాను. 1. అకాల వర్షాలతో పంట నష్టం జరిగిన ప్రాంతాలకు తక్షణం అధికార బృందాన్ని పంపి పంట నష్టం అంచనా వేయించాలి. నష్ట పరిహారం చెల్లించాలి. 2. టీఆర్ఎస్ ఎన్నికల హామీ అయిన రూ.లక్ష రుణమాఫీ తక్షణం అమలు చేయాలి. 3. కొనుగోలు కేంద్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా తరుగు, తేమ పేరుతో రైతులను దోపిడీ చేస్తోన్న వ్యాపారులపై క్రిమినల్ కేసులు పెట్టాలి. 4. పిడుగుపాటుతో చనిపోయిన రైతుల ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలి. 5. మిర్చీ, పత్తి, పసుపు ఇతర వాణిజ్య పంటల కొనుగోలు, మద్ధతు ధరపై తక్షణం కార్యచరణ రూపొందించాలి. 6. మామిడి, బత్తాయి, ఇతర పండ్ల రైతులను ఆదుకోవడానికి ప్రత్యేక కార్యచరణ రూపొందించాలి. 7. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కొనుగోలు కేంద్రాల్లో తడిసిపోయిన రైతుల ధాన్యాన్ని మద్ధతు ధరకే కొనుగోలు చేయాలి. 8. ధాన్యంలో తేమ లేకుండా, తాలు లేకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్న నిబంధనను సడలించాలి. తక్షణం ఈ డిమాండ్ల పరిష్కారానికి చొరవ తీసుకోని పక్షంలో ప్రత్యక్ష కార్యచరణకు దిగాల్సి వస్తుందని ఎంపీ రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

About The Author