మాస్కు ధరించని కోబ్రా కమాండోను గొలుసుతో కట్టేసిన పోలీసులు
కరోనా కట్టడిలో మాస్కులు ధరించడం కూడా ముఖ్యమైన అంశమే. అయితే సీఆర్పీఎఫ్ కు చెందిన ఓ కోబ్రా కమాండో మాస్కు ధరించకుడా కనిపించడం కర్ణాటక పోలీసులను ఆగ్రహానికి గురిచేసింది. అతడ్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో గొలుసుతో కట్టేశారు. బెళగావి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. సచిన్ సునీల్ సావంత్ అనే ఆ కోబ్రా కమాండో గొలుసులతో పీఎస్ లో బందీగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహావేశాలు రేకెత్తించాయి. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తితో ఇలాగేనా వ్యవహరించేది అంటూ కర్ణాటక పోలీసులను తీరును నెటిజన్లు తూర్పారబట్టారు. అటు, సీఆర్పీఎఫ్ కూడా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై తాము కర్ణాటక పోలీస్ చీఫ్ తో మాట్లాడామని, కమాండోకు బెయిల్ కోసం స్థానికంగా ఉన్న తమ అధికారితో పిటిషన్ వేయించామని సీఆర్పీఎఫ్ పేర్కొంది. సీఆర్పీఎఫ్ లో కోబ్రా కమాండోగా పనిచేస్తున్న సచిన్ సునీల్ సావంత్ ఏప్రిల్ 11వరకు సెలవులో ఉండగా, లాక్ డౌన్ కారణంగా ఆ సెలవు పొడిగించారు. అయితే, సచిన్ సునీల్ సావంత్ మాస్కులేకుండానే రోడ్డుపైకి వచ్చాడని, మాస్క్ ఏదని అడిగితే అసభ్యకరమైన భాష ఉపయోగించాడని పోలీసులు ఆరోపిస్తున్నారు.