తెలంగాణలో లాక్‌డౌన్ ఎత్తివేత ?


తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌కు తెరపడనున్నట్లు సమాచారం అందుతోంది. గడిచిన 7రోజుల్లో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య సింగిల్ డిజిట్‌లోనే ఉంటున్నాయి. అవి కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువగా నమోదవువతూ వస్తున్నాయి. నల్గొండ, ఆదిలాబాద్ , సూర్యపేట జిల్లాల్లో ఇటీవల కొన్ని కేసులు నమోదయ్యాయి. అయితే దాదాపు మిగతా జిల్లాలన్నీంటిలోనూ కరోనా తగ్గుముఖం పట్టినట్లుగా అధికారులు గుర్తించారు. గతంలో కేసులు అధికంగా నమోదైన నిర్మల్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలు కరోనా కోరల్లోంచి బయటపడ్డాయి.
కరీంనగర్‌లో 18, వరంగల్‌లో 27 పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కరీంనగర్ వాసి ఒక్కరే గాంధీలో చికిత్స పొందుతున్నారు.
మిగతా వారంతా ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయి హోం క్వారంటైన్‌లో కొనసాగుతున్నారు. వరంగల్‌లో కేవలం 4కేసులు మాత్రమే ఆక్టివ్‌గా ఉన్నాయి. ఖమ్మంలో మొత్తం 8 కేసులు నమోదు కాగా 4గురు డిశ్చార్జయ్యారు. 4కేసులు మాత్రమే ఆక్టివ్‌గా ఉన్నాయి. కొత్త కేసుల నమోదు కూడా ఆయా జిల్లాల్లో దాదాపుగా లేవనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలను ఆరంభించేందుకు సిద్ధమవుతోంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ మే7వరకు యథావిధిగా లాక్‌డౌన్ కొనసాగుతుందని వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే అనధికారికంగా గ్రామాల్లో లాక్‌డౌన్ ప్రభావం ఎంతమాత్రం కనబడటం లేదు. వ్యవసాయం పనులు ఊపందుకున్నాయి. దశల వారీగా లాక్‌డౌన్ ఎత్తివేతకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. మే8తర్వాత పట్టణాల్లో దుకాణాలను తెరుచుకునేందుకు అనుమతిస్తారని సమాచారం. ఫ్యాక్టరీలు, సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలన్ని ఆంక్షలతో కూడిన ఆరంభానికి నోచుకుంటాయని తెలుస్తోంది. ఇదిలా ఉండగా మే3న లాక్‌డౌన్‌పై ప్రధాని కీలక ప్రకటన చేస్తారని, ఆంక్షలతో కూడిన లాక్‌డౌన్ ఎత్తివేతకు సంబంధించిన ప్రకటన చేస్తారని మంగళవారం విలేఖరులతో చెప్పడం గమనార్హం.

About The Author