నాటు బాంబుల సుధాకర్ రెడ్డి సైకాలజిస్ట్ ఎలా అయ్యారు..?
*అది 1991వ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ తన కార్యకర్తలతో పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభ నిర్వహిస్తోంది*. జిల్లాలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన హేమాహేమీలు అందరూ సభలో ఉన్నారు మంత్రి చెంగారెడ్డి సభ నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి చింతా మోహన్ కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపించాలని నాయకులు మాట్లాడారు. చివరగా ఎంపీ అభ్యర్థి చింతా మోహన్ లేచి నిలబడి మాట్లాడడానికి సన్నద్ధం అవుతుండగా ఎక్కడి నుంచో ఒక్క ఉదుటున వేదికపైకి ఎన్ బి సుధాకర్ రెడ్డి వచ్చారు. చింతామోహన్ మైకును లాగి పడేశాడు. నువ్వు మాట్లాడడానికి వీలు లేదంటూ నానా రభస చేశాడు మంత్రి చెంగారెడ్డి ఆశీర్వాదంతో సుధాకర్ రెడ్డి రచ్చ చేశారని ఆ సభనుకవర్ చేయడానికి వెళ్లిన మేము (జర్నలిస్టులు) గుసగుసలాడుకున్నాము.వీటన్నింటిని మౌనంగా నిలబడి చూసిన చింతామోహన్ సర్దుబాటు తర్వాత చాలా కూల్ గా సభలో మాట్లాడారు. నేను దొరికి ఉంటే సుధాకర్ రెడ్డి నన్ను కొట్టి ఉండే వాడేమో అంటూ ఛలోక్తి విసిరారు.
1991లో నేను చూసిన సుధాకర్ రెడ్డి వరస అది. మరి ఇప్పుడు… ఆలుమగలు, తల్లీకూతుళ్లు, బాస్, మిత్రుల మధ్య ఏ సమస్య వచ్చినా….పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేసుకున్నా… వినబడే మొదటి మాట సైకాలజిస్ట్ సుధాకర్ రెడ్డి తో మాట్లాడి తరువాత రండి అని….
1991ప్రాంతంలో ఒక “#ఆవారా’ గా కనిపించిన సుధాకర్ రెడ్డి వాస్తవంగా ‘బహుముఖ ప్రజ్ఞాశీలి’ చదువులో కూడా మంచి విద్యార్థే. అమాయకంగా చదువే జీవితంగా పెరిగిన ఆ కుర్రాడే. సొంత గ్రామంలో పెత్తందారులు గా వ్యవహరించిన కుటుంబాలు తనపై దాడికి పాల్పడడంతో, అదే గ్రామంలో ఎదుర్కోవాలన్న కోరికతో యుద్ధ విద్యలలో ఆరితేరి చిన్న సైజు రౌడీ లా వ్యవహరించారు. ఘర్షణల్లో బాంబులు వినియోగించారు. ఎన్ బి సుధాకర్ రెడ్డి కాస్తా నాటు బాంబుల సుధాకర్ రెడ్డి అయ్యారు. 1978 నుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉన్న ఈయన పుత్తూరు ఎమ్మెల్యేగా జనతా పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఎప్పటికైనా ఎమ్మెల్యే, మంత్రి కావాలన్న లక్ష్యంతో ఉన్న సుధాకర్ రెడ్డికి తన మార్గం ఇది కాదని అర్థం అయి పోతూ ఉంది.
ప్రముఖ సైకాలజిస్టు బి.వి.పట్టాభిరామ్ సూచనతో సుధాకర్ రెడ్డి సైకాలజిస్ట్ గా మారారు. ఆ రంగంలో కూడా పాపులర్ అయ్యారు. ఇంటర్ తర్వాత డీఫార్మసీ చేశారు. రాజకీయాల్లో చురుగ్గా ఉంటూనే ఆరు పీజీలు, ఆరు డిప్లొమా కోర్సులు, ఎంఫిల్, పీహెచ్ డి తో పాటు, యోగా, జర్నలిజం వంటి డిగ్రీలు పొందారు. ప్రస్తుతం ఏపి కౌన్సిలింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఏపీ పాజిటివ్ థింకర్స్ క్లబ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గా పనిచేస్తున్నారు. 1990 తర్వాత ఓ స్కూల్ స్థాపించి విద్యావేత్తగా కూడా రాణించారు. అంబేద్కర్ సార్వత్రిక యూనివర్సిటీలో పదహారేళ్లుగా రైటింగ్ ఫర్ మీడియా పాఠాలు చెప్పారు. పలు పత్రికలకు సైకాలజిస్ట్ హోదాలో కాలమిస్ట్ గా ఉన్నారు. ప్రతి గురువారం వార్త పత్రికలో ‘వ్యధ’ పేరుతో శీర్షికను నిర్వహిస్తున్నారు. యవ్వనంలో రెండు పత్రికలకు ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభలకు పాత్రికేయునిగా సుధాకర్ రెడ్డి పనిచేశారు. ఆయన కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి వేలూరు విట్ కళాశాలలో పిహెచ్ డి చేస్తున్నారు.ఐఐఎం అహ్మదాబాద్ లో ఎఫ్ డి పి చేశారు. తిరుపతి ఐఐటీ అంతర్జాతీయ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. తండ్రిని మించిన తనయుడు హర్షవర్ధన్ రెడ్డి ఐదు క్రీడల్లో జాతీయ క్రీడా కారుడి గా ఉన్నారు. భార్య ఎన్ బి రాధ గ్రామ సర్పంచిగా ఎన్నికై వారి గ్రామానికి సేవలందించారు.
ఒక మనిషి భిన్న రంగాల్లో రాణించడం గొప్ప సంగతే. ప్రస్తుతం సైకాలజిస్ట్ గా తిరుపతి ప్రజలకు సేవలు అందిస్తున్న సుధాకర్ రెడ్డి రెండు లక్షల మందికి పైగా విద్యార్థులకు సదస్సులు జరిపి చైతన్యవంతం చేశారు. 50 వేల మంది ఉద్యోగులు, ఔత్సాహికులకు శిక్షణ ఇచ్చారు. 20 ఏళ్లుగా కౌన్సిలింగ్, ట్రైనింగ్ కార్యక్రమాలను నిర్వహించడమే గాక 500కు పైగా సెమినార్లు నిర్వహించారు. *60 ఏళ్ల వయసులోనూ అత్యంత ఉత్సాహంగా ప్రజలకు పలు పరిష్కారాలను చూపుతూ సమాజానికి తోడ్పడుతున్న ఎన్ బి సుధాకర్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేద్దాం*…
*కందారపు మురళి*
*ప్రధాన కార్యదర్శి*
*సిఐటియు*
*తిరుపతి*