ఏఈవో పోస్టులకు పోటెత్తిన నిరుద్యోగులు


26 ఖాళీలకు 722 మంది అభ్యర్థుల హాజరు
పట్టని భౌతిక దూరం

మహబూబ్‌నగర్‌ : ఉమ్మడి జిల్లాలో పొరుగు సేవల పద్ధతిలో 26 వ్యవసాయ విస్తరణ అధికారుల పోస్టుల భర్తీకి బుధవారం మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌లో నిర్వహించిన ఎంపిక ప్రక్రియకు అభ్యర్థులు పోటెత్తారు. రెవెన్యూ సమావేశ మందిరంలో అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన, మౌఖిక పరీక్షలు నిర్వహించారు. మొత్తం 26 పోస్టులు ఉండగా అందులో బీఎస్సీ అగ్రికల్చర్‌ చేసిన వారికి 10 పోస్టులు, డిప్లొమా చేసిన వారికి 13, అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ చేసిన వారికి 3 పోస్టులు కేటాయించారు. ఈ పోస్టులకు గాను ఉదయం 6 గంటల నుంచే ఉమ్మడి జిల్లా నుంచి అభ్యర్థులు పోటెత్తారు. మౌఖిక పరీక్షలకు ఈ స్థాయిలో అభ్యర్థులు హాజరు అవుతారని అధికారులు సైతం అంచనా వేయలేకపోయారు. కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలనే నిబంధనను సైతం ఉద్యోగ ధ్యాసలో అభ్యర్థులు మరిచిపోయారు. 722 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా ఇదే అదనుగా గెజిటెడ్‌ అధికారి సంతకానికి రెవెన్యూ సమావేశం బయట కొందరు ఒక్కో అభ్యర్థి నుంచి రూ.50లు వసూలు చేయడం గమనార్హం.
మౌఖిక పరీక్షలు నిర్వహించిన అదనపు కలెక్టర్‌ : పొరుగు సేవల పద్ధతిలో 26 ఏఈవోల పోస్టుల భర్తీకి జిల్లా అదనపు కలెక్టర్‌ మోహన్‌లాల్‌, ఆత్మ పీడీ హుక్యానాయక్‌, ఉద్యానశాఖ అధికారి సాయిబాబా, జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి శంకరాచారి అభ్యర్థులకు మౌఖిక పరీక్షలు నిర్వహించారు. విద్యార్హత ధ్రువీకరణ పత్రాల నిశిత పరిశీలనతోపాటు ఏఈవోల విధులు, బాధ్యతలు, క్షేత్రస్థాయిలో ఉండే పరిస్థితులు, పంటలు, రకాలు, విస్తీర్ణం, చేపట్టాల్సిన చర్యలు తదితర అంశాలపై ప్రశ్నించారు. ఉదయం 10.30 గంటల నుంచి మౌఖిక పరీక్షలు సాయంత్రం 7గంటల వరకు కొనసాగాయి. ఈ వ్యవసాయశాఖ ఏడీ వెంకటేశ్‌, డీఈవో ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.

About The Author