మ్యాన్‌హోల్‌లో మద్యం నిల్వ… బెల్టుషాపు నిర్వాహకుడి అరెస్ట్‌  


మద్యం అక్రమంగా విక్రయిస్తున్న వ్యాపారులు విచిత్ర విన్యాసాలతో ఎక్సైజ్‌ అధికారులకు చుక్కలు చూపుతున్నారు. గాజువాక ఎక్సైజ్‌ సర్కిల్‌ పెందుర్తి ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మదురవాడలో ఓ వ్యక్తి ఎక్సైజ్‌ సిబ్బందిని ముచ్చెమటలు పట్టించాడు. మ్యాన్‌హోల్‌లో మద్యం నిల్వ చేసి ఎంచక్కా విక్రయిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే… స్థానిక వాంబే కాలనీలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి ఇంట్లోనే మద్యం బెల్ట్‌ దుకాణం నడుపుతున్నాడు. దీనిపై స్థానిక వలంటీర్‌ షేక్‌ సుధా, మహిళా రక్షణ కార్యదర్శి కన్యాకుమారి సమాచారం మేరకు మంగళవారం గాజువాక ఎౖMð్సజ్‌ సహాయ సూపరింటెండెంట్‌ ఆర్‌.ప్రసాద్‌ ఆదేశాల మేరకు పెందుర్తి ఎక్సైజ్‌ ఎస్‌ఐ జి.బాబూరావు ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేశారు. అయితే ఎంత వెతికినా ఆ ఇంట్లో మద్యం దొరకలేదు. దీంతో ఎక్సైజ్‌ అధికారులు గట్టిగా ప్రశ్నించే సరికి కాలనీ వీధిలోని మ్యాన్‌హోల్‌లో మద్యం నిల్వ చేసినట్లు చెప్పాడు. అక్కడకు వెళ్లి పరిశీలించగా ఒక ట్రేలో 26 మద్యం సీసాలు లభించాయి. దీంతో మద్యాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడును అరెస్ట్‌ చేశారు. 
5 ఫుల్‌ బాటిళ్లు స్వాధీనం  
సీతమ్మధార (విశాఖ ఉత్తర): ఎయిర్‌పోర్టు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని టాస్క్‌ఫోర్సు పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. మాధవధార చివరి బస్టాప్‌ సమీపంలో కె.నాగార్జున అనే వ్యక్తి అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారంతో టాస్క్‌ఫోర్సు ఏసీపీ త్రినాథ్‌ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు చేశారు. ఈ దాడుల్లో ఐదు ఫుల్‌ బాటిళ్లు స్వాధీనం చేసుకొని, నిందితుడిని అరెస్ట్‌ చేశారు

About The Author