విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయుధం.. సీఎం జగన్ కొత్త వెబ్సైట్..
విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని విద్యాసంస్థలను మోనిటరింగ్ చేసేందుకు వీలుగా ఓ ప్రత్యేక వెబ్ సైట్ను లాంచ్ చేశారు. www.apsermc.ap.gov.in పేరిట ప్రారంభమైన ఈ వెబ్సైట్లో స్కూళ్ళు, కాలేజీలకు సంబంధించి పూర్తి వివరాలు ఉంటాయని.. వాటిని ఆయా స్కూళ్ళు, కాలేజీలు స్వయంగా అప్ లోడ్ చేస్తాయన్నారు.
దీని డొమైన్ అందరికీ అందుబాటులో ఉంటుందని జగన్ స్పష్టం చేశారు. వెబ్సైట్లో స్కూళ్ళు, కాలేజీలు నమోదు చేసిన వివరాలు ఏవైనా తప్పయితే.. ఎవరైనా సరే విజిల్ బ్లో చేసి వెంటనే సమాచారం అందించాలని సీఎం సూచించారు. విద్యారంగంలో కార్పోరేట్ వ్యవస్థకు చెక్ పెట్టే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్న సీఎం జగన్.. అందుకోసం రెండు ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేశామని వివరించారు. ఇప్పటికే వీళ్లు రాష్ట్రంలోని 62 స్కూళ్ళు, 40 కాలేజీలపై చర్యలు తీసుకున్నారని చెప్పారు.