ముజఫర్ఫుర్ చిన్నారి వైరల్ వీడియో: స్పందించిన పట్నా హైకోర్టు…
బిహార్‌లోని ముజఫర్‌పుర్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్న ఈ హృదయ విదారక ఘటనను పట్నా హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందో తెలియజేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన వలసకూలీలు కొందరు శనివారం గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి శ్రామిక్ రైలులో బిహార్‌కు బయలుదేరారు. సోమవారం ముజఫర్‌పుర్ స్టేషన్‌కు చేరుకున్న సమయంలో ఒక మహిళ (35) కుప్పకూలిపోయింది. మృతదేహాన్ని స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం వద్ద ఉంచగా.. తన తల్లి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిందని తెలియని ఆమె బిడ్డ.. మృత దేహం వద్ద బెడ్‌షీట్‌తో ఆడుకోవడం అక్కడి సీసీటీవీలో రికార్డయింది. ఈ వీడియోను ఆర్జేడీ నేత సంజయ్ యాదవ్ ట్వీట్ చేయగా అది వైరల్ అయ్యింది. ఇప్పుడు దానిపై పట్నా హైకోర్టు స్పందించింది.