ఇండియా పేరు మార్చాలని పిటిషన్..
జూన్ 2న సుప్రీం విచారణ
ఇండియా అనే పేరును భారత్ లేదా హిందుస్తాన్గా మార్చాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం జూన్ 2న విచారణ జరపనుంది.
ఇండియా అనే పేరును భారత్ లేదా హిందుస్తాన్గా మార్చాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం జూన్ 2న విచారణ జరపనుంది. అలా చేయడం వల్ల దేశ ప్రజల్లో ఆత్మగౌరవం, జాతీయత భావం పెరుగుతుందని పిటిషనర్ పేర్కొన్నారు. ఇండియా అనే పేరును మార్చి భారత్ లేదా హిందుస్తాన్గా పిలిచేలా రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో సవరణలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆర్టికల్ 1లోనే దేశం పేరు, సరిహద్దులు కూడా నిర్దేశించి ఉంటాయి. వాస్తవానికి ఈ పిటిషన్ శుక్రవారమే (మే 29) సుప్రీంకోర్టులో విచారణకు లిస్ట్ అయింది. అయితే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎస్.ఏ బాబ్డే అందుబాటులో లేకపోవడంతో ఆ తర్వాత లిస్ట్ నుంచి డిలీట్ చేశారు. సుప్రీంకోర్టులో అందుబాటులో ఉన్న నోటీసు ప్రకారం ఈ పిటిషన్ జూన్ 2వ తేదీన కోర్టు ముందుకు విచారణకు రానుంది.
ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఈ పిటిషన్ను దాఖలు చేశారు. భారత్ అనే పేరును హిందుస్తాన్గా మార్చడం వల్ల దేశ ప్రజలు గతంలో తాము మరొకరి పాలనలో ఉన్నామనే భావన నుంచి బయట పడతారని పిటిషనర్ పేర్కొన్నారు. ‘ఇంగ్లీష్ పేరును తొలగించి ఆ స్థానంలో ప్రతీకగా భావించే మరో పదం చేర్చడం వల్ల దేశ ప్రజల్లో ఆత్మగౌరవం, జాతీయతా భావం పెరుగుతుంది. ఓ రకంగా ఇండియా అనే పేరును తీసేసి అక్కడ భారత్ అనే పేరు చేర్చడం వల్ల స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిని గుర్తు చేసుకున్నట్టుగా కూడా ఉంటుంది.’ అని పిటిషన్లో పేర్కొన్నారు.
1948 సంవత్సరంలో భారత రాజ్యాంగాన్ని రూపొందిస్తున్న సమయంలోనే ఇండియా అనే పేరు స్థానంలో భారత్ లేదా హిందుస్తాన్ అనే పేరు పెట్టాలని బలంగా వాదన వినిపించిన అంశాన్ని పిటిషన్లో గుర్తు చేశారు. ఏదేమైనా ఇప్పటికైనా పేరుమార్చాలని కోరారు.