అగ్రకుల దురహంకారాన్ని జయించిన ఆమూరి దంపతులు..


అది 1991వ సంవత్సరం… అశోక్‌నగర్‌లోని సిపిఎం కార్యాలయంకు ఉపాధ్యాయ రంగం బాధ్యుడి నుంచి ల్యాండ్‌ లైన్‌కు ఫోన్‌ వచ్చింది. ఓ ప్రేమ జంటకు రక్షణ కల్పించాలన్నది ఆ కాల్‌ సారాంశం.
ఆఫీసులో మేమంతా మాట్లాడుకుంటుండగానే పాతికేళ్ల ఓ యువకుడు, ఇరవై ఏళ్ల యువతి బిక్కు… బిక్కు మంటూ… ఆందోళన నిండిన ముఖాలతో మా ముందుకు వచ్చి నిలబడ్డారు. ముందు కూర్చొండి….
టెన్షన్‌ పడొద్దు… అండగా మేమున్నాం… చెప్పండని అనగానే తానొక ఉపాధ్యాయుడినని, దళిత కుటుంబంలో పుట్టానని తాను పనిచేస్తున్న గ్రామంలో ‘రెడ్డి’ కులానికి చెందిన అగ్రకుల యువతి తాను ప్రేమించుకున్నామని చెప్పారు. పెద్దలు అంగీకరించకపోవటంతో పుత్తూరులో పెళ్లి చేసుకున్నామని అమ్మాయి బంధువులు జీపులు వేసుకుని, బృందాలుగా తమకోసం వెదుకుతున్నారని, కాంగ్రెస్‌ పార్టీ పెద్దల మద్దతు వారికుందని, తమను చంపేస్తారన్న భయంతో మీ దగ్గరకు వచ్చామని వివరించారు. తెలిసిన వాళ్ల ఇంట్లో ఉంటే ఆ ఏరియా అంతా తమకోసం గాలించారని విధిలేక మీరు రక్షణ కల్పిస్తారని తెలిసి వచ్చామని ఆ యువ దంపతులు తమ గోడును చెప్పుకున్నారు. ఆ జంట చెబుతున్న వివరాలను ‘‘కళ్లు” పెద్దవి చేసుకుని, చెవులు రిక్కించుకుని నవయువకులుగా, ఉన్న మేమంతా విన్నాం.
నాడు ప్రాణ రక్షణ కోసం వచ్చిన ఉపాధ్యాయుడు మరెవరో కాదు. ఆమూరి సుబ్రమణ్యం గారు, ఆయన భార్య మునిరత్నమ్మ (మణి) లు. ఇది 1991వ సంవత్సరం ఆగష్టు 30వ తేదీన జరిగింది. సిపిఎం పార్టీ వారి రక్షణలో
ఉన్నారని తెలుసుకున్న అమ్మాయి తరపు బంధువులు వారి దూకుడు తగ్గించారు. కానీ ప్రయత్నాలు మానలేదు.
ఈ యువజంటకు సిపిఎం కార్యాలయంలో పూర్తికాలం కార్యకర్తలు ఉండే ఒకే ఒక్క గదిని వారికోసం కేటాయించారు. వీరి రక్షణ కోసం పార్టీ కార్యాలయంలో యువ నాయకులంతా రాత్రి, పగలు తేడా లేకుండా కొన్నాళ్ల పాటు రక్షణగా ఉన్నారు. పార్టీ, యువజన కమిటీలలో వీరికి రక్షణ కల్పించాలని నిర్ణయం జరిగింది.
నాటి జిల్లా కలెక్టర్‌ ఐ.వి.సుబ్బారావు, ఎస్‌పి రమణమూర్తి, డిడిఓ ఆర్‌.సుబ్రమణ్యంల దృష్టికి వీరి సమస్యను తీసుకెళ్లాం. కలెక్టర్‌ ఐవి సుబ్బారావుగారు బాగా స్పందించి, జిల్లా ఎస్‌పికి చెప్పారు. అక్షరాస్యతా ఉద్యమంలో ఆన్‌ డ్యూటీ కింద తిరుపతిలో విధులు కేటాయించారు. ఆమూరి దంపతులు తిరుపతిలో కాపురం పెట్టారు.
1991లో తిరుపతిలో కాపురం ప్రారంభించిన ఈ యువజంట, ఆదర్శ జంటగా మారారు. ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. విద్యావంతులుగా తీర్చిదిద్దారు. స్వతహాగానే మంచి గాయకుడైన ఆమూరి సుబ్రమణ్యం అక్షరాస్యతా ఉద్యమంలో చురుగ్గా ఉండేవారు. శ్రావ్యమైన గొంతుక ఉన్న ‘‘ఆమూరి’’ ప్రజలను ఇట్టే ఆకట్టుకునే వారు. పాకాల మండలం వరదప్పనాయుడి కండ్రిగకు చెందిన ఆమూరి అదే మండలంలోని పాలగుట్ట పల్లె గ్రామంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ, అక్షరాస్యతా ఉద్యమంలో వంటీర్‌గా ఉన్న మునిరత్నమ్మ (మణి)ని ప్రేమించారు. ఇరువురి కులాలు ఒకటి కాకపోవటంతో మణి బంధువులు, పెళ్లికి నిరాకరించారు. అగ్రకుల పెత్తందారీ స్వభావాన్ని ప్రదర్శించారు. విధిలేక పారిపోయి, పెళ్లి చేసుకుని కమ్యూనిస్టులను ఆశ్రయించారు. కులదురహంకారాన్ని ఎదుర్కోవటమే కాకుండా, ధైర్యంగా జీవిస్తూ పలువురికి ఆదర్శంగా నిలిచారు.
పాకాల మండలం వరదప్ప నాయుడిపేట గ్రామానికి చెందిన ఆమూరి చెంగమ్మ, మునెయ్యల ఆఖరి సంతానం ఆమూరి సుబ్రమణ్యం. స్పెషల్‌ టీచర్‌గా జీవితాన్ని ప్రారంభించిన ఆమూరి ఎంఏ, బిఇడి చేశారు. సినిమా రచయితలపై 2008లో పిహెచ్‌డిని చేశారు.
2015లో పౌరాణిక, పద్య నాటకాలకు ‘‘నంది అవార్డు’’ న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు.తిరుపతికి చెందిన ప్రముఖ ఎస్‌వి నాటక కళాపరిషత్‌కు కూడా న్యాయ నిర్ణేతగా ఉన్నానని చెప్పారు.
ఇప్పటి వరకూ స్వయంగా వందకు పైగా పాటలు రాశారు. 50 నాటికలలో వివిధ పాత్రలు పోషించారు. ఎయిడ్స్‌, కుష్ఠు, అక్షరాస్యత, పర్యావరణం వంటి సమస్యలపై ప్రజలను చైతన్యవంతం చేయటానికి నాటకాలు రాశారు.
ఆరోగ్యం, అక్షరాస్యత, బాల్య వివాహాలపై పాటలు రచించారు. సంగీత దర్శకునిగా బడికెళతానమ్మ, ఆంజనేయ చరణం, లక్ష్మీ నారాయణ స్వామి వంటి నాలుగు సిడిలు తయారు చేశారు.
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ధర్మోజిరావు అనే రచయిత తన జీవితాన్ని పద్య కావ్యంగా రచించి, ‘‘ఆనంద మోహిని’’ అనే పేరుతో పుస్తకాన్ని రచించారని, తమను ఆహ్వానించి పుస్తకావిష్కరణ జరిపారని ఇవన్నీ తన జీవితంలో మరపురాని ఘట్టాలని ఆమూరి అంటారు. ఎన్నో అవార్డులు, రివార్డులతో గుర్తించబడ్డ ఆమూరిని మనం కూడా అభినందిద్దాం.
*కందారపు మురళి* `
*సిఐటియు*
*ప్రధాన కార్యదర్శి*,
*తిరుపతి*

About The Author