నిమ్స్ లో నలుగురు డాక్టర్లు, ముగ్గురు సిబ్బందికి కరోనా…


హైదరాబాద్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. రోజురోజుకి పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఉస్మానియా మెడికల్ కాలేజీలో కరోనా కలకలం రేగింది. 15మంది విద్యార్థులకు కరోనా సోకడం ఆందోళన నింపింది. ఇప్పుడు డాక్టర్లను కూడా కరోనా వదలడం లేదు. హైదరాబాద్ నిమ్స్ లో నలుగురు డాక్టర్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అలాగే నిమ్స్ క్యాత్ ల్యాబ్ లో పని చేసే ముగ్గురు సిబ్బందికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో నిమ్స్ లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇతర డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు ఆందోళన చెందుతున్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి డాక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. కరోనాపై పోరాటంలో వైద్యులు, వైద్య సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వైద్యులు కూడా వైరస్ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు రంగంలోకి దిగారు. కరోనా బారిన పడ్డ డాక్టర్లు, సిబ్బంది కాంటాక్ట్ అయిన వారి వివరాలు సేకరిస్తున్నారు.
ఉస్మానియా మెడికల్ కాలేజీలో 15మందికి కరోనా:
ఇప్పటికే ఉస్మానియా మెడికల్ కాలేజీ లో 15 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా వచ్చింది. దీంతో ఉస్మానియా పీజీ విద్యార్థులు భయంతో వణికిపోతున్నారు. కాలేజ్ యాజమాన్యం ఇప్పటికే రీడింగ్ రూమ్ ను మూసేసింది. ప్రతి ఒక్క పీజీ విద్యార్థిని PPE కిట్స్ ధరించమని ప్రిన్సిపల్ శశికళ సూచించారు. జూనియర్ డాక్టర్స్ కు పాజిటివ్ రావటంతో హాస్టల్ మొత్తాన్ని శానిటైజేషన్ చేసింది జీహెచ్ఎంసీ. జూన్ 20 నుండి పీజీ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంతలో ఈ ఘటన చోటుచేసుకుంది. కరోనా పాజిటివ్ వచ్చిన వారు పరీక్షలు రాసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని ప్రిన్సిపాల్ తెలిపారు. ఔట్ పేషేంట్ విభాగాలకు జూనియర్ డాక్టర్లను పంపాలా.. వద్దా.. అని పునరాలోచన చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఉస్మానియా మెడికల్ కాలేజీకి అనుసంధానంగా ఉన్న 10 హాస్పిటల్స్ లోని వివిధ విభాగాల్లో జూనియర్ డాక్టర్లు పనిచేస్తున్నారు.
తెలంగాణలో 2,891 కరోనా కేసులు, 92 మరణాలు:
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మొన్న 199 కేసులు నమోదవగా, కొత్తగా(జూన్ 2,2020) 99 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో నలుగురు కరోనాతో మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 70 కేసులు నమోదవగా, మేడ్చల్ 3, నల్గొండ జిల్లాలో 2 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మహబూబ్ నగర్, జగిత్యాల, మంచిర్యాల, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది.
లాక్ డౌన్ సడలింపులతో భారీగా పెరిగిన కేసులు:
12 మంది వలస కార్మికులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో తెలంగాణలో కరోనా కేసులు 2,891కి చేరాయి. కరోనాతో 92 మంది మృతి చెందారు. రాష్ట్రంలో 1,273 యాక్టివ్ కేసులు ఉండగా, 1,526 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం కరోనా కేసుల్లో 2,264 మంది రాష్ట్ర వాసులు కాగా, మిగతా 434 మంది విదేశాల నుంచి వచ్చిన వారు, వలస కూలీలు. ఇప్పటివరకు 1213 మంది వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. లాక్ డౌన్ లో సడలింపుల తర్వాత రాష్ట్రంలో ఒక్కసారిగా కరోనా కేసుల సంఖ్య పెరిగిపోయింది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరగడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. సోమవారం (జూన్ 1, 2020) కొత్తగా 94 కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలోనే 79 కేసులు ఉన్నాయి.

About The Author