పీపీఈ కిట్లిచ్చిన వైద్యులకు కరోన ఎలా సోకింది.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తెలంగాణ హైకోర్టు


హైదరాబాద్: కరోనా విపత్కర పరిస్థితుల్లో వివిధ ఆస్పత్రుల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులకు రక్షణ కిట్లు (పీపీఈ కిట్లు) ఇచ్చినప్పటికీ వారికి కరోనా ఎలా సోకిందో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, పరీక్షల నిర్వహణపై విశ్రాంత డీఎంహెచ్‌వో రాజేందర్‌, విశ్రాంత ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వరరావు, మరికొంత మంది దాఖలు చేసిన 7 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయసేన్‌ రెడ్డి ధర్మాసనం ఇవాళ విచారించింది.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజులు సరఫరా చేయాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ.. ప్రభుత్వం పట్టించుకోలేదని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ కోర్టుకు తెలియజేశారు. ఉస్మానియా, నిమ్స్‌ తదితర ఆస్పత్రుల్లోని 37 మంది వైద్యులు, వైద్య విద్యార్థులకు కరోనా సోకిందని కోర్టుకు వివరించారు. దీనిపై స్పందిచిన ధర్మాసనం వైద్య సిబ్బంది అందరికీ కరోనా రక్షణ కిట్లు ఇచ్చినట్లు గతంలో ప్రభుత్వం నివేదించిందని.. అలాంటప్పుడు వైద్యులకు కరోనా ఎలా వచ్చిందని.. ఎవరి ద్వారా వైద్యులకు కరోనా సోకిందో నిర్ధారించారా?అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో ఈనెల 8వ తేదీలోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.

About The Author