జులైలో మరోసారి మిడతల దాడి


హెచ్చరించిన ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ

దిల్లీ: పంటలపై ముప్పేట దాడికి దిగి వివిధ రాష్ట్రాలను కలవరపెట్టిన మిడతల దండు జులైలో మరోసారి భారత్‌కు వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏఓ) అంచనా వేసింది. ఇప్పటికే పంజాబ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ఈ మిడతల దండు తీవ్ర స్థాయిలో పంటనష్టానికి కారణమైన విషయం తెలిసిందే. రాజస్థాన్‌లోని బాడ్‌మేర్‌, జోధ్‌పూర్‌ సహా మధ్యప్రదేశ్‌లోని వింధ్య, బుందేల్‌ఖండ్‌, గ్వాలియన్‌-చంబల్‌ ప్రాంతాల్లోని అనేక గ్రామాల్లో ఇప్పటికీ మిడతల దాడి కొనసాగుతున్నట్లు జాతీయ మిడతల హెచ్చరిక కేంద్రం(ఎల్‌డబ్ల్యూఓ) తెలిపింది. గత నాలుగు రోజుల నుంచి కొత్తగా ఎలాంటి దండు భారత్‌కు రాలేదని స్పష్టం చేసింది.

వచ్చే జులైలో ఇరాన్‌, పాకిస్థాన్‌, ‘ఆఫ్రికా కొమ్ము’గా పిలిచే దేశాల నుంచి కొత్తగా మరోసారి మిడతల దండు వచ్చే అవకాశం ఉందని ఎఫ్‌ఏఓ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో భారత్‌లోని వివిధ రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ప్రస్తుతం కెన్యా, సొమాలియా, ఇథియోపియా దేశాల్లో మిడతలు గుడ్డు దశలో ఉన్నాయని తెలిపింది. ఇవన్నీ జూన్‌ రెండో వారం నుంచి జులై రెండోవారం నాటికి రెక్కలు విచ్చుకునే దశకు చేరుకుంటాయని పేర్కొంది. అనంతరం ఇవి కెన్యా నుంచి ఇథియోపియా, దక్షిణ సుడాన్‌ మీదుగా సుడాన్‌ చేరుకుంటాయని తెలిపింది. వీటిలో కొన్ని ఇథియోపియా నుంచి సొమాలియా ఈశాన్యానికి కూడా వెళతాయని పేర్కొంది. అక్కడి నుంచి ఉత్తర హిందూ మహాసముద్రం మీదుగా.. భారత్‌-పాక్‌ సరిహద్దులకు చేరుకుంటాయని వివరించింది. ఒక్కో దండు రోజులో దాదాపు 150 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. ఒక్క చదరపు కి.మీ విస్తీర్ణంలో విస్తరించి ఉండే ఈ మిడతల గుంపు 35వేల మందికి సరిపడే ఆహారాన్ని తినేస్తాయని అంచనా.

దీనిపై స్పందించిన ఎల్‌డబ్ల్యూఓ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. ఇప్పటికే ట్రాక్టర్లు, డ్రోన్లు, అగ్నిమాపక యంత్రాలు ద్వారా రసాయనాలు చల్లి వేల హెక్టార్లలో మిడతల్ని అదుపులోకి తెచ్చామని వెల్లడించింది. ఖరీఫ్‌లో మరోసారి దాడి జరిగే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అన్ని ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోందని వివరించింది. ఈసారి హెలికాప్టర్లు కూడా వినియోగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది.

About The Author