ఆకాశభైరవ దేవాలయం
శివుడు హిందువులకు ఆరాధ్యదైవం. శివుడు చాలా వరకూ లింగరూపంలో మనకు దర్శనమిస్తాడు. ఆయన సాధారణ రూపంలో దర్శనమిచ్చే ప్రదేశాలు ప్రపంచం మీద కేవలం వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. పానివట్టం మీ గోళాకారం లేదా అండాకారం రూపంలో మహాశివుడు మనకు శివలింగం రూపంలో దర్శనమిస్తాడు. అయితే కొన్ని చోట్ల శివలింగం కూడా విభిన్న రూపాల్లో ఉండటాన్ని మనం గమనించవచ్చు. ఈ నేపథ్యంలో భారత దేశంలో విభిన్న రూపాల్లో ఉన్న శివలింగాలకు సంబంధించిన వివరాలు మీ కోసం…
ఆకాశభైరవ దేవాలయం
శివుడి విశేష రూపమే భైరవ రూపం. ఇందులో కూడా విభిన్న రూపాలు ఉన్నాయి. అందులో ఆకాశభైరవ రూపం విశిష్టమైనది. ఈ ఆకాశ భైరవ రూపాన్ని అత్యంత విశిష్టమైనదిగా ఆరాధిస్తారు. ఈ దేవాలయం నేపాల్ రాజధాని ఖాట్మాండులో ఉంది. ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్యకాలంలో ఇక్కడ విశిష్ట పూజలు జరుగుతాయి. ఈ సమయంలో ఆకాశభైరవుడిని ఊరేగిస్తారు.
అర్థనారీశ్వర లింగం
ఆ మహాశివుడు తన శరీరంలో సగభాగాన్ని తన భార్య అయిన పార్వతీదేవికి ఇచ్చి అర్థనారీశ్వరుడిగా పేరు తెచ్చుకొన్నారు. అంటే శరీరంలో సగభాగం పురుషుడి రూపంలో ఉండగా సగభాగం స్త్రీ రూపంలో ఉంటుంది. ఈ అర్థనారీశ్వరుడికి మనదేశంలో చాలా తక్కువ చోట్ల ఆలయాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది తమిళనాడులోని నామక్కల్ జిల్లాలోని తిరుచెంగూడ అనే చిన్న గుట్ట పై ఉన్న దేవాలయం.
అష్టమూర్తి దేవాలయం
భారతదేశంలోని వేదాలను అనుసరించి శివుడు కొన్ని విశేష గుణగణాలను కలిగి ఉన్నారు. అందులో ఎనిమిది లక్షణాలు ముఖ్యమైనవి. ఆ ఎనిమిది లక్షణాలు ఒకే మూర్తిలో ఉండటం చాలా అరుదైన విషయం. అటువంటి మూర్తినే అష్టమూర్తి శివుడు అని అంటారు. ఈ విశిష్ట రూపంలో ఉన్న శైవ దేవాలయం చత్తీస్ఘడ్ రాష్ట్రంలోని జంజగీర్-చంపా జిల్లాలోని ఖరూద్ అనే పట్టణంలో ఉంది.
కాళభైరవ దేవాలయం
కాళభైరవ రూపం శివుడి ఒక ఉగ్రస్వరూపం. ఒకసారి బ్రహ్మ తానే త్రిమూర్తుల్లో అధికుడని విర్రవీగుతాడు. అంతేకాకుండా పరమశివుడు చేసే ప్రతి పనికి అడ్డుతగలడం మొదలుపెడుతారు. దీంతో స`ష్టికార్యం అస్తవ్యస్తం అవుతుంది. దీంతో కోపగించుకొన్న శివుడు తన శరీరం నుంచి కాళభైరవుడిని స`ష్టించి బ్రహ్మ ఐదు తలల్లో ఒకదానిని ఖండిస్తాడు. ఈ కాళభైర రూపంలో ఉన్న శివలింగం తిరువణ్ణామలై కాగా ఆశ్రమంలో మనకు కనిపిస్తుంది.
భిక్షాటన మూర్తి దేవాలయం
బ్రహ్మ ఐదు తలల్లో ఒక తల తలను నరకడం వల్ల పాపం మూటగట్టుకొన్న పరమశివుడు భిక్షాటన రూపంలో లోకసంచారం మొదలు పెడుతాడు. అటు పై ఆ భిక్షాటనమూర్తి కాశీకి వెళ్లి తన పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకొంటాడు. ఆ భిక్షాటనమూర్తి దేవాలయం తమిళనాడులోని తిరువణ్ణామలైలోని అణ్ణామలై దేవాలయంలో ఉపాలయంగా మనం చూడవచ్చు.