తొలిరోజు శ్రీవారి దర్శనం ఇలా కనులారా..తనివితీరా

తిరుపతి: పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో సాధారణ భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 84 రోజుల లాక్‌డౌన్ తరువాత స్వామివారిని దర్శించుకున్న భక్తులు భావోద్వేగాలకు గురయ్యారు. భక్తులు పరిమితంగా దర్శించుకోవడానికి అవకాశం లభించడం వల్ల ఒక్కో భక్తుడికి ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు ఏడుకొండలవాడిని తనివితీరా దర్శించుకునే భాగ్యం కలిగింది. ఒకవంక భారీ వర్షం కురుస్తున్నా లెక్క చేయలేదు. తొలిరోజు మూడువేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు

అలిపిరిలోనే అన్ని పరీక్షలు..

తిరుమల ప్రవేశానికి ప్రధాన ద్వారంగా భావించే అలిపిరి వద్దే థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించారు. మాస్కులు ధరించాలని సూచించారు. వాహనాలను సోడియం క్లోరైడ్ పిచికారీతో శుభ్రం చేశారు. శానిటైజర్లను చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు. కరోనా వైరస్ నిబంధనలు ప్రతి భక్తుడూ తప్పనిసరిగా పాటించాలంటూ మైకుల ద్వారా ప్రచారం చేశారు. తిరుమలలో స్వామివారి దర్శనానికి వెళ్లిన సమయంలో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, క్యూలైన్లలో భౌతికదూరం పాటించాలని ఆదేశించారు.

తెరచుకున్న కల్యాణకట్ట..

శ్రీవారి భక్తులు తలనీలాలను సమర్పించుకోవడానికి ఏర్పాటు చేసిన కల్యాణకట్టను పునరుద్ధరించారు. కల్యాణకట్టను తెరవకూడదని మొదట తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నిర్ణయించుకున్నప్పటికీ.. భక్తుల డిమాండ్‌ను, వారి మనోభావాలను గౌరవించాలని అనంతరం నిర్ణయించుకున్నారు. భౌతిక దూరాన్ని పాటించేలా అన్ని జాగ్రత్తలను తీసుకుని కల్యాణకట్టను తెరిచారు. తొలిరోజు 1500 మందికి పైగా భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు.

క్షురకులకు పీపీఈ కిట్లు..

కల్యాణకట్టలో విధులను నిర్వహించే ప్రతి క్షురకుడికీ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ) కిట్లను అందజేశారు. వాటిని ధరించిన తరువాత క్షురకులు విధి నిర్వహణకు హాజరయ్యేలా టీటీడీ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక్కో క్షురకుడికి మధ్య కనీసం 10 అడుగుల దూరం ఉండేలా ఏర్పాట్లు చేశారు. రొటేషన్ పద్ధతిన క్షురకులు విధులకు హాజరు కావాలని ఆదేశించారు. ఒకరోజు విధులకు హాజరైన క్షురకుడు.. మరోరోజు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని సూచించారు. 

కనులారా శ్రీవారి వీక్షించిన భక్తులు..

సాధారణంగా శ్రీవారిని దర్శించుకునే సమయంలో భక్తుల తాకిడి తీవ్రంగా ఉంటుంది. రెప్పపాటులో దర్శనాన్ని ముగించుకోవాల్సిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. శ్రీవారి గర్భాలయం ముందు ఒక్క సెకెను కూడా నిల్చునే అవకాశం భక్తుడికి ఉండదు. ఈ సారి దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. భక్తుల సంఖ్య పరిమితంగా ఉండటం వల్ల కనులారా స్వామివారిని దర్శించుకునే అరుదైన అవకావం లభించింది. ఇదివరకట్లా భక్తులను టీటీడీ సిబ్బంది తోసివేయట్లేదు. ఒక్కో భక్తుడు నిమిషానికి పైగా స్వామివారిని వీక్షించే భాగ్యం కలిగింది.

క్యూలైన్లలో ప్రవేశించిన అరగంటలోనే

క్యూలైన్లలో ప్రవేశించిన అరగంట వ్యవధిలోనే భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయం వెలుపలికి వస్తున్నారు. ఇంతకు ముందులా గంటలకొద్దీ సమయం ఇప్పుడు పట్టట్లేదు. క్యూలైన్లలో ఎక్కడా నిల్చునే పరిస్థితి లేదు. అతి కొద్ది సందర్భాల్లో భక్తులు క్యూలైన్లలో వేచి చూసే అవసరం రాలేదు. ఎలాంటి ఆర్జిత సేవలు ప్రస్తుతం అందుబాటులో లేవు. ఫలితంగా సర్వ దర్శనం.. సులభతరమైందని భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

తిరుమలలో కుండపోతగారుతు పవనాల ప్రభావం వల్ల తిరుమలలో కుండపోతగా వర్షం కురిసింది. సాధారణ భక్తులకు తిరుమల ఆలయ ప్రవేశాన్ని కల్పించిన తొలిరోజే వరుణదేవుడూ శ్రీవారిని దర్శించుకున్నట్టయింది. ఎడతెరిపి లేకుండా కొన్ని గంటల పాటు వర్షం కురిసింది. భక్తుల సంఖ్య పరిమితంగా ఉండటం వల్ల వర్షం వల్ల ఎవరూ పెద్దగా ఇబ్బందులకు గురి కాలేదు. కాటేజీల్లో కూడా భక్తులు పరిమితంగా కనిపించారు. శ్రీవారిని దర్శించుకున్న వెంటనే చాలామంది తిరుగుముఖం పట్టారు.

About The Author