అచ్చెన్నాయుడు అరెస్ట్.. జస్ట్ ట్రైలర్ మాత్రమే.. ముందుంది సినిమా..
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ స్కాంలో దాదాపు రూ.151 కోట్ల అవినీతి జరిగినట్లు తెలిపారు. కాగా, అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. తాజాగా అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై నగరి ఎమ్మెల్యే రోజా స్పందించారు. తప్పు చేశారని రుజువైంది కాబట్టే అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారని ఆమె అన్నారు. ఆధారాలతో అరెస్ట్ చేస్తే కిడ్నాప్ చేశారని చంద్రబాబు అంటున్నారని.. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియట్లేదని విమర్శించారు.
తాము ఎవరిని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదన్న రోజా.. గత ప్రభుత్వ హాయాంలో అవినీతి జరిగినట్లు ప్రతీ అసెంబ్లీ సెక్షన్‌లోనూ సీఎం వైఎస్ జగన్ లెక్కలతో నిరూపించారన్నారు. అంతేకాకుండా తమ ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగితే నిరూపించాలని గతంలోనే లోకేష్ ఓ ప్రెస్ మీట్లో చెప్పారు. ఇప్పుడు అదే నిరూపిస్తున్నామని.. అచ్చెన్నాయుడు అరెస్ట్ కేవలం ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుందని రోజా తెలిపారు. రాజధాని భూముల్లో అక్రమాలు, ఫైబర్ ఫ్రిడ్, చంద్రన్న కానుకలలో జరిగిన అవకతవకలను ఖచ్చితంగా బయటికి తీసుకొస్తామని.. తప్పు చేసిన వ్యక్తి బీసీ అయినా, ఓసీ అయినా, ఎస్సీ అయినా.. ఎవరైనా కూడా తప్పకుండా జైలుకు పంపిస్తామని ఎమ్మెల్యే రోజా వెల్లడించారు