రాక్‌మెన్ కంపెనీపై చర్యలు కోరుతూ సిఐటియు ధర్నా
తిరుపతి:రాక్‌మెన్ కంపెనీలో అక్రమంగా తొలగించబడిన 250 మంది కార్మికులను తక్షణం పనుల్లోకి తీసుకుని పర్మినెంటు చేయాలని కోరుతూ తిరుపతి ఆర్‌డిఓ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది,
15వ తేది సోమవారం నాటి ఉదయం సిఐటియు నేత టి.సుబ్రమణ్యం అధ్యక్షతన ఆర్‌డిఓ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం జరిగింది. రాక్‌మెన్ కంపెనీ నుంచి తొలగించబడ్డ కార్మికుందరికీ తక్షణం ఉద్యోగం కల్పించి, పర్మినెంటు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి డిమాండ్ చేశారు. ధర్నానుద్దేశించి కందారపు మురళి ప్రసంగిస్తూ రాక్‌మెన్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాయితీలు పొందుతూ ఉచిత కరెంటు, భూమి, పన్నుల వంటి రాయితీలు పొంది స్థానికులను కంపెనీ నుంచి వెళ్లగొట్టటం దారుణమని విమర్శించారు.
ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి పరిశ్రమలలో ఉద్యోగాలు 75 శాతం మంది స్థానికులకు ఇవ్వాలని చట్టం చేసినా, పరిశ్రమలు పాటించటం లేదని, తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. రాక్‌మెన్ కంపెనీ తన చుట్టుపక్కల గ్రామాల నుంచి పని చేస్తున్న 250 మంది కార్మికులను ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా ఏకపక్షంగా తొలగించిందని యాజమాన్యంపై తీవ్ర విమర్శలు చేశారు.
తొలగించబడిన 250 కార్మిక కుటుంబాలు వీధిన పడి ఏడుస్తుంటే కాళహస్తి ఎంఎల్‌ఏ బియ్యపు మధుసూదన్ రెడ్డి యాజమాన్యాన్ని సమర్ధిస్తూ మాట్లాడటం, తాను కాంట్రాక్టు తీసుకుంటున్నానని, తన కాంట్రాక్టు కింద కార్మికులు ఉద్యోగాల్లోకి రావాలని చెప్పటం దారుణమని విమర్శించారు.
రాక్‌మెన్ కంపెనీ యాజమాన్యం తక్షణం 250 మంది కార్మికులను ఉద్యోగాల్లోకి తీసుకోకుంటే ఉద్యమం రాష్ట్ర వ్యాపితంగా చేస్తామని హెచ్చరించారు.
ఎఐటియుసి జిల్లా కార్యదర్శి పి.మురళి ప్రసంగిస్తూ రాక్‌మెన్ కంపెనీ కార్మికుల పోరాటానికి సంపూర్ణ మద్దతును ప్రకటించారు. కేంద్రంలోని మోడీ, రాష్ట్రంలోని జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వాలు యాజమానుల పట్ల మెతక వైఖరి అవంభించటం వల్లే కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతున్నదని హెచ్చరించారు. జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.యాదగిరి ప్రసంగిస్తూ రాక్‌మెన్ కంపెనీ యాజమాన్య దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు. కార్మికులకు జానపద కళాకారులు అండగా ఉంటారని ప్రకటించారు. సిఐటియు జిల్లా నేతలు, వివిధ ప్రజా సంఘాల నేతలు ఆర్.క్ష్మి, మునిరాజా, పద్మనాభం, చిన్నా, గురుప్రసాద్, సుజాతమ్మ, మాధవ్, రమణయాదవ్, ఎన్‌డి శ్రీనివాసులు తదితరులు పాల్గొని మద్దతు ప్రకటించారు.(కందారపుమురళీ)
(ప్రధాన కార్యదర్శి)