కరోనా వేళ… నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన అనంతపురం జిల్లా పోలీసుశాఖ
– పోలీసు స్టేషన్లకు వచ్చే ప్రజల ఆరోగ్య భద్రతకు భరోసాగా తాత్కాలిక రిసెప్సన్ సెంటర్లు ఏర్పాటు
– ప్రజల బాధలు వినే పోలీసు స్టేషన్ సిబ్బంది/ అధికారుల సేఫ్టీ కోసం పలు చర్యలు
అనంతపురం:
కరోనా వైరస్ నేపథ్యంలో అనంతపురం జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తీ స్థాయిలో అప్రమత్తమయ్యింది.
ఒకవైపు కరోనా కట్టడి కోసం చర్యలు చేపడుతూనే… మరోవైపు బాధలతో పోలీసుస్టేషన్లకు వచ్చే ప్రజల ఆరోగ్య భద్రతకు భరోసాగా మరియు సిబ్బంది/అధికారుల శ్రేయస్సు కోసం సురక్షిత చర్యలకు పూనుకుంది. జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు పిటీషనర్ల ఆరోగ్య భద్రత మరియు పోలీసు సిబ్బంది సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు.
ప్రతీ పోలీసు స్టేషన్లో ప్రత్యేకంగా తాత్కాలిక నూతన రిసెప్సన్ సెంటర్లను ఏర్పాటు చేయించారు. పోలీసు స్టేషన్ ఆవరణ ప్రారంభంలోనే గుఢారాలు లేదా క్యాబిన్లు తాత్కాలికంగా సిద్ధం చేసుకున్నారు.
బాధలతో పోలీసు స్టేషన్లకు వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా స్టేషన్ ముఖద్వారం వద్ద పెడల్ శ్యానిటైజర్లు మరియు డిస్ ఇన్ఫెక్సన్ స్ప్రేయర్లు ఉంచడం…
బ్యారికేడ్లు సిద్ధం చేయడం… తదితర ఏర్పాట్లుతో తాత్కాలిక రిసెప్సన్ సెంటర్లు నిర్వహిస్తున్నారు.
ప్రజల బాధలు వినతి రూపంలో స్వీకరించే పోలీసు సిబ్బంది లేదా అధికారులు మాస్కులు, గ్లవుజులు, ఫేస్ షీల్డులు ధరించడం…
శ్యానిటైజర్లు వినియోగించడం తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకున్నారు. ప్రతీ పోలీసు స్టేషన్ ను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు శ్యానిటైజ్ చేయించేలా చర్యలకు ఉపక్రమించారు.
సిబ్బంది ఆరోగ్య పరిస్థితులను తరుచూ తెలుసుకునేందుకు వీలుగా ఆక్సిమీటర్లను పోలీసు స్టేషన్లలో అందుబాటులో ఉంచారు
. కరోనా వేళ … స్టేషన్లకు వచ్చే ప్రజలు ఇబ్బందిపడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు కరోనా భారిన పడకుండా కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. జిల్లాలోని పోలీసు సిబ్బందిని వయస్సు ఆధారంగా మూడు కేటగిరీలుగా విభజించి కరోనా భారినపడకుండా విధులు అప్పగిస్తున్నారు.
అన్ని పోలీసు స్టేషన్లలోని సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నారు. పోలీసు స్టేషన్ల పరిధిలోని సిబ్బంది ఆరోగ్యంపై సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లకే బాధ్యత అప్పగించారు.