కరోనాతో కన్నుమూసిన ఇరాక్ ఫుట్‌బాల్ దిగ్గజం

బాగ్దాద్: ఇరాక్ ఫుట్‌బాల్ దిగ్గజం అహ్మద్ రాది ఆదివారం కోవిడ్‌తో కన్నుమూశాడు. చికిత్స కోసం జోర్డాన్‌కు తరలించడానికి కొన్ని గంటల ముందు ఆయన మృతి చెందినట్టు ఈ మేరకు ఆరోగ్యశాఖ తెలిపింది. 56 ఏళ్ల రాది 1986లో బెల్జియంతో జరిగిన ప్రపంచకప్ ఫైనల్స్‌లో చేసిన గోల్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడంతో గతవారం బాగ్దాద్‌లో ఆసుపత్రిలో చేరాడు. అయితే, పరిస్థితి మెరుగుపడడంతో గురువారం డిశ్చార్జ్ అయ్యాడు. అయితే, ఆ తర్వాత కొన్ని గంటలకే ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో తిరిగి ఆసుపత్రిలో చేరాడు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం కన్నుమూశాడు. శ్వాస తీసుకోవడంలో రాది ఇబ్బందిపడినట్టు వైద్యులు తెలిపారు. అతడిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు. స్ట్రైకర్ అయిన రాది సారథ్యంలోని ఇరాక్ జట్టు 1984, 1988లలో గల్ఫ్ కప్‌లు సాధించింది. ఈ సందర్భంగా ఆసియన్ ఫుట్‌బాలర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎన్నికయ్యాడు. 

About The Author