హిజ్రాతో ప్రేమ: సహజీవనం..అంతలోనే
చెన్నై : హిజ్రాపై మనసుపారేసుకున్న యువకుడు పెద్దలను ఎదిరించి నెలరోజుల క్రితం వేరు కాపురం పెట్టాడు. సహజీవనం సాగిస్తున్న ప్రేమికులిద్దరూ ఇంతలోనే శనివారం ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కారైక్కాల్ సమీపం తిరునల్లారుకు చెందిన దిలీప్ (26) అనే యువకునికి నిరావీ ప్రాంతానికి చెందిన షివానీ (30) అనే హిజ్రాకు మధ్య ఆరునెలల క్రితం ఏర్పడిన స్నేహం కొద్దిరోజులకు ప్రేమగా మారింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా ఘాటైన ప్రేమికులుగా మారిపోయారు.
ఈ ప్రేమ వ్యవహారం దిలీప్ ఇంట్లో తెలియడంతో గట్టిగా మందలించారు. అయితే షివానీపై ప్రేమను వదులుకునేది లేదని స్పష్టం చేసిన దిలీప్ సుమారు నెలరోజుల క్రితం ఇల్లువదిలిపెట్టి వెళ్లి కారైక్కాల్ ఒడుదురై ప్రాంతంలో షివానీతో కాపురంపెట్టాడు. ఇంతలా ప్రేమను పంచుకున్న ఇద్దరి మధ్య వేరుకాపురం పెట్టిన తరువాత ఏమైందో ఏమో శనివారం ఇద్దరూ ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు.