నంద్యాల గ్యాస్ లీకేజీ ఘటన మృతుడి భార్య.. రెండు కోట్లివ్వండి..

కర్నూల్ జిల్లా: నంద్యాల ఎస్పీవై రెడ్డి ఆగ్రో కంపెనీలో విషవాయువు లీకైన ఘటనలో జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహానికి ఆదివారం పోస్టు మార్టం పూర్తయ్యింది. అయితే నష్టపరిహారం రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలని మృతుని భార్య శ్రీలక్ష్మి డిమాండ్ చేస్తోంది. కంపెనీ రూ.50 లక్షలు మాత్రమే ఇస్తామంటోందని, తన భర్త జనరల్ మేనేజర్ స్థాయిలో ఉన్న వ్యక్తి అని ఆమె వాపోయింది. ఆసుపత్రి బయట అంబులెన్స్‌లో శ్రీనివాసరావు మృతదేహాన్ని పెట్టిన కుటుంబ సభ్యులు.. పరిహారం విషయం తేల్చే వరకు తీసుకోబోమని తేల్చి చెప్పారు. 

అమోనియం గ్యాస్‌ లీకేజితో శనివారం జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆగ్రో ఇండస్ర్టీస్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో ఇథనాల్‌ తయారీ పరిశ్రమలోని సీఓ-2 లిక్విఫైయింగ్‌ ప్లాంటులో శనివారం గ్యాస్‌ పైపులు పేలాయి. దీంతో ప్రమాదకరమైన 2 టన్నుల అమోనియం వాయువుల వెలువడ్డాయి. కొద్ది కాలంగా గ్యాస్‌ పైపులు మరమ్మతులో ఉండగా శుక్రవారం రాత్రి దాకా ఆ పైపులకు వెల్డింగ్‌ చేశారు. శనివారం కార్బన్‌ డై ఆక్పైడ్‌ను లిక్విడ్‌గా మార్చే క్రమంలో అమోనియంను పంపే ప్రక్రియలో తీవ్రమైన ఒత్తిడి కలిగింది. ఈ సమయంలో గ్యాస్‌ను పంపడంతో వెల్డింగ్‌ చేసిన ప్రాంతం వద్ద పైపులు ఒక్కసారిగా పేలిపోయాయి. వెల్డింగ్‌ పైపుల పరిశీలనార్థం అక్కడే నిలబడ్డ సంస్థ జీఎం శ్రీనివాస్‌ మృత్యువాత పడ్డారు. కొద్ది దూరంలో ఉన్న నలుగురు అమోనియం గ్యాస్‌ తీవ్రత నుంచి తప్పించుకుని ప్రాణాపాయ పరిస్థితి నుంచి తప్పించుకున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం అడుగడుగునా స్పష్టమవుతోందని కాలుష్య నియంత్రణ, పరిశ్రమల శాఖ అధికారులు వ్యాఖ్యానించారు. కనీస నిబంధనలు కూడా పాటించకపోవడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా గుర్తించారు. 

About The Author