మీ ఆరోగ్యం.. మా బాధ్యత
తిరుపతి, మీ ఆరోగ్యం.. మా బాధ్యత అని,ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలో కరోనా బాధితులకు మెరుగైన సేవలు అందించే దిశగా చర్యలు చేపడతామని కోవిడ్-19 తిరుపతి సమన్వయ కమిటీ సమావేశంలో ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు అధైర్య పడొద్దని భరోసా కల్పించారు. తిరుపతి పరిధిలో ఆరోగ్య శ్రీ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న అన్ని ఆసుపత్రులలో కోవిడ్-19 వైద్య సేవలు అందించాలని సూచించారు.
టెస్టుల అనంతరం మెరుగైన వైద్యం, సౌకర్యాలు వంటి వాటిపై బాధితులు దృష్టి సారిస్తున్నారని, ఈ వైరస్ కు ఎవరూ అతీతులు కాదని చెప్పుకొచ్చారు. ఈ కరోనా కాలంలో జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా అందరి అధికారులను కలుపుకొని బాధితులకు అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు.
తుడా కార్యాలయంలో ఆదివారం కోవిడ్ -19 తిరుపతి సమన్వయ కమిటీ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధ్యక్షతన జేసి వీరబ్రహ్మం (విద్య, వైద్యం), తుడా వీసీ హరికృష్ణ, సెక్రటరీ లక్ష్మీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి వైద్యుల తో సమీక్షించారు. కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవలు, కల్పించాల్సిన సౌకర్యాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ…
రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు నేపధ్యంలో బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అంతకన్నా ముందుగా ప్రభుత్వ వ్యవస్థ ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాలని కోరారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న క్రమంలో ప్రజల్లో ఆందోళన కర పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవస్థ పట్ల ప్రజాప్రతినిధి గా నేను , డాక్టర్లు గా మీరు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆందోళనలో ఉన్న ప్రజలకు భరోసా కల్పించి కాపాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రభుత్వ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసి సమస్యలను అధిగమించాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ వైద్యం అందించడం ద్వారా బాధితుల్లో మనోదైర్యం కల్పించే ప్రయత్నం చేయాలన్నారు. డాక్టర్లకు, పారామెడికల్ సిబ్బంది కి ఫైవ్ స్టార్ సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపడతమని వెల్లడించారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని శ్రీ పద్మావతి నిలయంలో కరోనా బాధితులకు అందుతున్న సేవల పట్ల గర్వంగా ఉందన్నారు. కరోనా టెస్ట్ ఫలితాలు త్వరగా వెలువడేలా చర్యలు ఉండాలి. అలాగే పాజిటివ్ వచ్చిన వ్యక్తులు ద్వారా ఇతరులకు సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుని క్వారంటైన్ కు తరలించాలన్నారు. అందుకు అవసరమైన అంబులెన్సు లను ఎంపీడీవో కార్యాలయాల వద్ద ఏర్పాటు చేయాలన్నారు. కరోనా టెస్టుల సంఖ్య, అన్ని పరీక్షలకు సంబంధించిన ల్యాబ్ ల సంఖ్య పెంచాలి, నాణ్యమైన మెడిసిన్, మెరుగైన సదుపాయాలు కల్పించే దిశగా చర్యలు ఉండాలన్నారు. కరోనా బాధితులు క్వారంటైన్, ఐశులేషన్ కేంద్రాల్లో చేరినప్పటి నుంచి తిరిగి నయమయి ఇంటికి వెళ్లే వరకు కల్పించే వైద్యసేవలు, సౌకర్యాలు వంటి తదితర అంశాలకు సంబంధించి అధికారులతో చర్చించారు. ప్రతి రోజు సమన్వయ కమిటీ చర్చించి బాధితులకు ఎక్కడ లోపం లేకుండా మెరుగైన సేవలు అందించనున్నట్లువివరించారు.క్వారంటైన్ కేంద్రాల్లో కరోనా బాధితుడు బిజీగా గడిపేలా పుస్తక పఠనం కు అవసరమైన బుక్ లను అందించేందుకు నిర్ణయించారు. అలాగే బాధితులకు అందించే పోషక ఆహారం, సౌకర్యాలు, చిన్న పిల్లలకు ఆట వస్తువులు అందించాలనే దిశగా చర్చించారు. విడతల వారీగా ల్యాబ్ టెక్నీషయన్ లు, ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం తో చర్చించనున్నట్లు వెల్లడించారు.
ఈ సమావేశంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్ కృష్ణ ప్రశాంతి, ప్రభుత్వ విప్ ఓఎస్డీ భాస్కర్ నాయుడు, తుడా ఇఇ వరదా రెడ్డి, తుడా ఎల్ ఏ అధికారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.