12 కిలోమీటర్లు పరిగెత్తి పట్టేసింది!
బనశంకరి(కర్ణాటక): ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 కిలోమీటర్లు ఏకధాటిగా పరిగెత్తి పోలీసు జాగిలం నేరస్తుడిని పట్టుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. నేరస్తుడిని పట్టుకోవడంలో తమకు సహకరించిన శునకాన్ని పోలీస్ బాస్‌లు సముచితరీతిలో సన్మానించారు.
దావణగెరె పోలీస్ డాగ్‌స్క్వాడ్‌లో ఉన్న తొమ్మిదేళ్ల తుంగా అనే డాబర్‌మెన్ శునకం రెండుగంటల్లో 12 కిలోమీటర్లు వెళ్లి హంతకుడి ఆచూకీ కనిపెట్టింది. చేతన్ అనే వ్యక్తి తన స్నేహితుడు చంద్రానాయక్ తదితరులతో కలిసి ధారవాడ జిల్లాలోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఒక సర్వీస్ రివాల్వర్, బంగారు నగలు దోచుకెళ్లి అందరూ సమానంగా పంచుకున్నారు. కానీ చంద్రానాయక్ తనకు వాటా ఎక్కువ కావాలని డిమాండ్ చేయడంతో చేతన్ ఆ సర్వీస్ రివాల్వర్‌తో అతన్ని కాల్చి చంపి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఘటనాస్థలాన్ని జాగిలం తుంగాతో కలిసి పరిశీలించారు. వాసన పసిగట్టిన తుంగా పరుగులు తీస్తూ రెండు గంటల తర్వాత కాశీపుర తాండాలో వైన్‌షాప్ వద్దకు వెళ్లి అక్కడ హోటల్ వద్ద నిలబడింది. సమీపంలోని ఇంటి ముందుకు వెళ్లి గట్టిగా మొరగసాగింది. ఆ ఇల్లు చేతన్ బంధువుది కాగా, చేతన్ అక్కడే మొబైల్లో మాట్లాడుతున్నాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా చోరీ, హత్య చేసినట్లు నిజం ఒప్పుకున్నాడని చెన్నగిరి డీఎస్పీ ప్రశాంత్ మున్నోళ్లి తెలిపారు. పోలీసు జాగిలాలు గరిష్టంగా 8 కిలోమీటర్ల వరకూ వెళ్తాయి. కానీ తుంగా అంతదూరం వెళ్లడం గొప్ప విషయమని ఎస్పీ హనుమంతరాయ కొనియాడుతూ శునకాన్ని సన్మానించారు.
తుంగా ఘనత
కొద్ది నెలల క్రితమే దావణగెరె పోలీస్ డాగ్‌స్క్వాడ్‌లో చేరిన తుంగా కీలక కేసులను ఛేదించడంలో ప్రధానపాత్ర పోషించింది. 30 హత్య కేసులతో 60 కేసుల్లో పోలీసులకు సహాయపడింది. ప్రతిరోజు ఉదయం 5 గంట నుంచే తుంగా దినచర్య ప్రారంభమతుంది. సుమారు 8 కిలోమీటర్ల వరకు నడక, జాగింగ్ చేస్తుంది.