44 ఎర్ర చందనం దుంగలు సహా ఇద్దరు తమిళ స్మగ్లర్లు అరెస్ట్
అరెస్ట్ అయిన వారిలో అటవీ అధికారుల హత్య కేసులో ముద్దాయి:
ఒక బొలెరో వాహనం స్వాధీనం:
వారం రోజులుగా శేషాచలం అడవుల్లో తిష్ట వేసిన తమిళ స్మగ్లర్లు
తిరుపతి:శేషాచలం అడవుల్లో తమిళ స్మగ్లర్లు మరోసారి రెచ్చిపోయారు. దాదాపు 40 మంది తమిళ స్మగ్లర్లు వారం రోజుల పాటు అడవుల్లో ఉంటూ 44 ఎర్ర చందనం దుంగలను అక్రమ రవాణా చేస్తుండగా, టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిపై విరుచుకుపడ్డారు. దీంతో ఎదురుదాడికి దిగిన స్మగ్లర్లు, ఒక కానిస్టేబుల్ ను గాయపరిచారు. ఇద్దరు స్మగ్లర్లు ను పట్టుకోగా, మిగిలిన వారు దుంగలను పడేసి పారిపోయారు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం 4.00 గంటల సమయంలో జరిగింది. దుంగలను లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్న బొలెరో జీప్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఇంచార్జి శ్రీ రవిశంకర్ తెలిపారు.
ఆయన టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆర్ ఎస్ ఐలు వాసు, లింగాధర్ గత మూడు రోజులు గా శ్రీనివాస మంగాపురం అడవుల్లో కూంబింగ్ చేస్తుండగా, పక్కా సమాచారం తో స్మగ్లర్లు పై దాడి చేసినట్లు తెలిపారు. తమిళనాడు జవ్వాది మలైకు చెందిన ప్రభు (30), సురేష్ (32) లను అరెస్ట్ చేశారు.