ఒకట్రెండు రోజుల్లో విద్యా సంవత్సరంపై ప్రకటన..TS


హైకోర్టుకు తెలిపిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ తరగతులు నిషేధించాలని కోరుతూ హైదరాబాద్‌ స్కూల్స్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు వివరణ ఇస్తూ ఆన్‌లైన్‌, దూరవిద్య విధానంలో విద్యా సంవత్సరం ప్రారంభించాలని కేబినెట్‌ నిర్ణయించిందని తెలిపింది. ఒకట్రెండు రోజుల్లో పాఠశాల విద్యా సంవత్సరాన్ని ప్రకటిస్తామని వెల్లడించింది. అనంతరం కోర్టు స్పందిస్తూ ‘‘మార్చిలోనే విద్యా సంవత్సరం మొదలు పెట్టినట్టు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పాఠశాలలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం రాష్ట్ర విద్యా శాఖ పరిధిలోని పాఠశాలలకే వర్తిస్తుందా?’’ అని ప్రశ్నించింది. కొన్ని కార్పొరేట్ పాఠశాలలు గంటల తరబడి ఆన్‌లైన్‌ పాఠాలు చెబుతున్నాయని, ఐదో తరగతి లోపు విద్యార్థులు గంటల తరబడి ఆన్‌లైన్‌లో ఎలా ఉండగలరు? అని ప్రశ్నించింది. వీటి వల్ల పిల్లలపై మానసిక, శారీరక ప్రభావం ఉంటుందని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో ప్రైవేటు పాఠశాలలు పాటించాల్సిన విధి విధానాలను కూడా ప్రకటిస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఫీజులు వసూలు చేయొద్దన్న జీవోను పాఠశాలలు ఉల్లంఘిస్తున్నాయని పిటిషనర్‌ కోర్టుకు తెలపగా.. ప్రస్తుత దశలో ఈ విషయంలో ఉత్తర్వులు ఇవ్వలేమని, విచారణ పూర్తయ్యాక అవసరమైతే ఫీజులు వెనక్కి ఇవ్వాలని ఆదేశిస్తామని కోర్టు తెలిపింది. ఆన్‌లైన్‌ తరగతులపై తమ వైఖరి వెల్లడించేందుకు సీబీఎస్‌ఈ కొంత సమయం కోరింది. దీంతో కోర్టు తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.

About The Author