‘విద్యార్థి’ మూవీ టీజర్ విడుదల…
సురేందర్‌రెడ్డి, హరీష్ శంకర్, సాయి కొర్రపాటి, దామోదర్ ప్రసాద్ చేతుల మీదుగా ‘విద్యార్థి’ టీజర్ విడుదల
‘రాజుగారి గది’ ఫేమ్ చేతన్ చీను, టిక్‌టాక్ ఫేమ్ బన్నీ వాక్స్ (వర్షిణి) హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘విద్యార్థి’. మహాస్ క్రియేషన్స్ బ్యానర్‌పై రాజేటి రామకృష్ణ, వంశీ తాడికొండ భాగస్తులుగా ఆళ్ల వెంకట్ (ఏవీ) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మధు మాదాసు రచన చేస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. “ఎ లోన్ ఫైట్ ఫర్ లవ్” (A Lone Fight For Love) అనేది ట్యాగ్‌లైన్. శుక్రవారం ఈ ఫిల్మ్ టీజర్‌ను దర్శకులు సురేందర్‌రెడ్డి, హరీష్ శంకర్, నిర్మాతలు సాయి కొర్రపాటి, కె.ఎల్. దామోదర్ ప్రసాద్ చేతుల మీదుగా విడుదల చేశారు.
టీజర్‌ను బట్టి ఉద్వేగభరితమైన, ఉత్తేజభరితమైన కథతో ‘విద్యార్థి’ రూపొందుతున్నట్లు అర్థమవుతోంది. హీరో చేతన్ చీను టైటిల్ రోల్లో ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. “మన జాతీయ గీతం మీద అంత గౌరవం ఉన్న మీకు మా జాతంటేనే ఎందుకు సార్ అంత కోపం” అనే హీరో మాటలతో పాటు, హీరోయిన్‌తో ఒక క్యారెక్టర్ “ఏంటే తక్కువ నాకొడుకుతో చాలా ఎక్కువగా తిరుగుతున్నావ్?” అని అడుగుతుండటాన్ని బట్టి హీరో ఒక నిమ్న కులానికి చెందినవాడనీ, హీరోయిన్ అగ్ర వర్ణానికి చెందిన అమ్మాయనీ తెలుస్తోంది.
హీరో హీరోయిన్లు ప్రేమించుకోవడాన్ని సహించలేని హీరోయిన్ ఫ్యామిలీ.. హీరోనీ, అతడి ఫ్రెండ్స్‌నీ హత్య చేయించడానికి పథకం వేశారనీ, తన ప్రేమను గెలిపించుకోవడానికి హీరో ఒంటరిగా పోరాడాడనీ టీజర్ ద్వారా అర్థమవుతోంది. “ఎ లోన్ ఫైట్ ఫర్ లవ్” అనే ట్యాగ్‌లైన్ దీన్నే తెలియజేస్తోంది. టీజర్ చివరలో “కంచెలు, కట్టుబాట్లు మంచి చెడుల మధ్య ఉండాలి.. మనుషుల మధ్య కాదు. మనుషుల మధ్య హద్దులుండాలి.. అడ్డుగోడలు కాదు.” అని ఒక లెక్చరర్ క్యారెక్టర్ చెప్తున్న మాటలే ఈ సినిమా కథకు ఆయువుపట్టు అని ఊహించవచ్చు.
ఆద్యంతం ఉత్కంఠభరితమైన కథనం, మంచి యాక్షన్ సన్నివేశాలతో సినిమా నడుస్తుందని ‘విద్యార్థి’ టీజర్ తెలియజేస్తోంది. హీరో చేతన్ చీను క్యారెక్టర్ పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. ఆ క్యారెక్టర్లో ఆయన పర్ఫార్మెన్స్ ఆకట్టుకొనేలా ఉంది. బల్గనిన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాల్లోని ఇంటెన్సిటీకి మరింత బలం చేకూర్చేలా ఉంది. ఖన్నయ్య సిహెచ్. సినిమాటోగ్రఫీ ఇంప్రెసివ్‌గా కనిపిస్తోంది.
‘విద్యార్థి’ చిత్రంలో 5 పాటలు, 6 ఫైట్లతో పాటు భారీ స్థాయిలో చిత్రీకరించిన కబడ్డీ ఎపిసోడ్ ఉన్నాయి.
రెండు మూడు రోజుల ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. గుంటూరు, రాజమండ్రి, వైజాగ్, అరకు వంటి లొకేషన్లలో 42 రోజుల పాటు సింగిల్ షెడ్యూల్లో చిత్రీకరణ జరిపారు.
తారాగణం:
చేతన్ చేన్, బన్నీ వాక్స్ (వర్షిణి), రఘుబాబు, మణిచందన, జీవా, టీఎన్ఆర్, నవీన్ నేని, యడం రాజు, నాగమహేష్, పవన్ సురేష్, శరణ్ అడ్డాల.
సాంకేతిక బృందం:
పాటలు: భాస్కరభట్ల, సురేష్ బనిశెట్టి, వాసు వలబోజు
సంగీతం: బల్గనిన్
సినిమాటోగ్రఫీ: ఖన్నయ్య సిహెచ్.
ఎడిటింగ్: బి. నాగేశ్వరరెడ్డి
స్టంట్స్: రామకృష్ణ
కొరియోగ్రఫీ: అనేష్
లైన్ ప్రొడ్యూసర్: వంశీ తాడికొండ
సహ నిర్మాత: రామకృష్ణ రాజేటి (ఆర్.ఆర్.కె.)
నిర్మాత: ఆళ్ల వెంకట్ (ఏవీ)
దర్శకత్వం: మధు మాదాసు
బ్యానర్: మహాస్ క్రియేషన్స్