కేంద్రమంత్రి రాం విలాస్ పాశ్వాన్(74) కన్నుమూశారు


కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీశాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్(74) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు చిరాగ్ పాస్వాన్ తెలిపారు. రాం విలాస్ పాశ్వాన్ ఇటీవల ఢిల్లీ ఆస్పత్రిలో గుండె శస్త్రచికిత్స చేయించుకున్నారు. దేశంలోని అత్యంత ప్రసిద్ధ దళిత నాయకులలో ఒకరైన పాశ్వాన్ గత కొన్ని వారాలుగా ఆసుపత్రిలో ఉన్నారు. గుండె సంబంధ ఇబ్బందులతో ఆయన చాలాకాలంగా బాధపడుతున్నట్లుగా సమాచారం. తన తండ్రి మరణం గురించి లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ ట్వీట్ చేస్తూ.. “పాపా… ఇప్పుడు మీరు ఈ ప్రపంచంలో లేరు కానీ మీరు ఎక్కడ ఉన్నా ఎల్లప్పుడూ నాతోనే ఉంటారని తెలుసు. మిస్ యు పాపా అని పేర్కొన్నారు.
తండ్రి ఆరోగ్యం గురించి ఇటీవలే చిరాగ్ పాశ్వాన్ స్పందిస్తూ… గత కొన్ని రోజులుగా నాన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం సాయంత్రం కొన్ని ఆకస్మిక పరిణామాల కారణంగా అర్ధరాత్రి సమయంలో గుండెకు ఆపరేషన్ చేయవలసి వచ్చింది. అవసరమైతే మరికొన్ని వారాల తర్వాత కూడా మరొక ఆపరేషన్ నిర్వహించాల్సి రావచ్చు. ఈ పోరాటంలో తనకు, తన కుటుంబానికి అండగా నిలిచిన ప్రతీఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు

About The Author