కరోనా గాలిలో కూడా ఇలా వ్యాపిస్తుంది.. నిర్దారణకు వచ్చిన సిడిసి ..
కరోనా సోకిన వ్యక్తి దగ్గినపుడు, తుమ్మినపుడు వెలువడిన తుంపర్లలో వైరస్ ఉంటుందని, అది గాలి ద్వారా ప్రయాణించి వేరొకరికి సోకే అవకాశముంటుందని అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఓ ప్రకటన విడుదల చేసింది. . అయితే సాధారణంగా తుంపర్లు కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత పేలిపోయి, వైరస్ నేలపై పడిపోతుంది. అలాంటప్పుడు 6 అడుగుల దూరం లోపల ఉన్న వారికి వైరస్ సోకే అవకాశముంటుంది. మరోవైపు గాలి, వెలుతురు సక్రమంగా ప్రసరించని చోట్ల తుంపర్ల ద్వారా కనీసం 2 మీటర్ల కంటే ఎక్కువ దూరం వైరస్ ప్రయాణించగలదని సీడీసీ వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో 6 అడుగుల కంటే ఎక్కువ దూరం ఉన్నప్పటికీ వైరస్ వ్యాప్తి ప్రభావం ఎక్కువగా ఉంటుందని తేల్చింది.
అయితే వైరస్ గాలిలో ఎంతసేపు బతికుంటుందనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. దీని వ్యవధి కొన్ని సెకెన్ల నుంచి గంటల వరకు ఉండొచ్చని సీడీసీ అభిప్రాయపడింది. గాలి వెలుతురు ఎక్కువగా ఉన్నప్పుడు తుంపర్లు తొందరగా పేలిపోవడం గానీ, ఆవిరవడం కానీ జరుగుతుంది. దీనివల్ల వైరస్ తొందరగా నశించిపోయి వ్యాప్తి తీవ్రత తగ్గుతుందని సీడీసీ తెలిపింది. మనం తిరిగే చోట్ల గాలి వెలుతురు సక్రమంగా ప్రసరించేలా జాగ్రత్త పడాలని సూచించింది. వైరస్ సోకిన వ్యక్తులు తుమ్మినపుడు, దగ్గినపుడు వేలకొద్దీ తుంపర్లు వెలువడతాయని.. అందువల్ల కనీసం 6 అడుగుల దూరం పాటిస్తూ.. మాస్కులు, శానిటైజర్లు వాడాలని అక్కడి ప్రజలకు సీడీసీ సూచించింది.