విద్యుత్ షాక్ తో మహిళ మృతి….


విద్యుత్ షాక్ తో మహిళ మృతి.
ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యం.మూడు అడుగుల ఎత్తులో విద్యుత్ వైర్లు.ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు.నిండు ప్రాణం బలి.
రొంపిచెర్ల:విద్యుత్ షాక్ తో మహిళ మృతి చెందిన సంఘటన రొంపిచెర్ల మండలం,చెంచమరెడ్డి గారి పల్లె గ్రామపంచాయతీ,శ్రీరాముల పల్లి లో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సుబ్బరాయుడు భార్య కుమారి (42) శనివారం తెల్లవారుజామున 4:30 నిమిషాల సమయంలో నిద్రలేచి కూలి పనులకు వెళ్ళేందుకు బయటికి వచ్చారు. అయితే ఇంటి పక్కనే వెలుగుతున్న విద్యుత్ వైర్లు మూడు అడుగుల ఎత్తులోకి వచ్చాయి. ఇది గమనించని కుమారి మెడకు వైర్లు తగులుకొని అక్కడికక్కడే మృతి చెందారు. కొంత సేపటికి కుటుంబసభ్యులు కనుక్కుని కేకలు వేశారు. దీంతో చుట్టుపక్కల వారు వచ్చి కరెంట్ ఆఫ్ చేసి శవాన్ని పక్కకు తీశారు. విద్యుత్ తీగలు కిందనే ఉన్నాయని గత కొన్ని నెలలుగా విద్యుత్ అధికారులకు చెపుతున్న ఖాతరు చేయలేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దౌర్జన్యం గా కరెంట్ బిల్లులు వసూలు చేసే ట్రాన్స్కో సిబ్బంది విద్యుత్ లైన్లు మరమ్మతుల గురించి పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా నే ఒక నిండు ప్రాణం పోయిందని చెప్పారు. మృతురాలి ఇంటికి రెండు వైపులా 5 అడుగుల ఎత్తులోపే కరెంట్ వైర్లు కిందనే ఉన్నాయని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు తీసుకొని విద్యుత్ వైర్లను మరమ్మతులు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. మృతురాలకి భర్త తో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.కుమారి మృతి తో కుటుంబసభ్యులు,బంధువులు బోరున విలపించారు. ప్రభుత్వం మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

About The Author