ఆడపిల్ల వద్దని.. కుమారుడే కావాలనిభర్త వేధింపులు భార్య ఆత్మహత్యాయత్నం


తాటిచెట్లపాలెం: ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు… మరోసారి ఆడపిల్ల పుడుతుందేమోనని భయపడిన భర్త భార్యకు అబార్షన్‌ చేయించడం, ఆపై తరచూ వేధిస్తుండడంతో మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సకాలంలో బంధువులు రక్షించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇవి. కంచరపాలెం వాడవీధి ప్రాంతానికి చెందిన ఇనుప వ్యర్థాల దుకాణం నిర్వాహకుడు త్రిమూర్తిరాజుకు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మౌనిక(35)కు 2005లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. మగ పిల్లాడు పుడితే తమకుటుంబానికి వారసుడుగా ఉంటాడని భావిస్తున్న త్రిమూర్తిరాజుకు…మరో భయం పట్టుకుంది. భార్య మూడోసారి కూడా ఆడపిల్లకు జన్మనిస్తుందేమోననే ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఆమెకు ఇటీవల గర్భస్రావం చేయించి, శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడు. బుధవారం మళ్లీ భార్యతో ఘర్షణ పడ్డాడు. దీంతో మౌనిక తీవ్ర మనస్తా పానికి గురై ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆ తర్వాత బంధువులు గమనించి, స్థానికుల సహాయంతో రక్షించి, చికిత్స కోసం ఓ ప్రయివేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ సమాచారం తెలియడంతో తూర్పుగోదావరి జిల్లా నుంచి మౌనిక సోదరుడు వరప్రసాద్‌రెడ్డి నగరానికి వచ్చి కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ కృష్ణారావు ఆధ్వర్యంలో ఎస్‌.ఐ. అప్పలనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

About The Author