రైలు టిక్కెట్ల బుకింగ్‌కు కొత్త నిబంధనలు…


న్యూఢిల్లీ: రైలు టిక్కెట్ల బుకింగ్‌కు కొత్త నిబంధనను ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) శనివారంనాడు ప్రకటించింది. దీని ప్రకారం, రైళ్లు బయలుదేరాల్సిన నిర్ణీత సమయానికి 30 నిమిషాల ముందు సెకెండ్ రిజర్వేషన్ ఛార్ట్‌ సిద్ధం చేస్తారు.

ఇంతకుముందు, కరోనా మహమ్మారి సమయంలో ప్యాసింజర్ల సౌకర్యార్థం నిర్ణీత రైలు సమయానికి 2 గంటల ముందు ఛార్ట్ సిద్ధం చేసేవారు. కరోనా మహమ్మారికి ముందు, కేవలం ఒకే ఛార్ట్ సిద్ధం చేసేవారు. అదికూడా రైలు నిర్ణీత సమయానికి 4 గంటల ముందు చేసేవారు. కాగా, ఐఆర్‌సీటీసీ తాజా నిర్ణయంతో మిగిలిపోయిన సీట్లను ప్రయాణికులు ఆన్‌లైన్ ద్వారా కానీ, ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్‌ ద్వారా కానీ పొందవచ్చు.
కొత్త మార్పులతో చివరి నిమిషంలో ప్రయాణం చేయాల్సి వచ్చిన వారికి ప్రయోజనం కలుగుతుంది. అలాగే, చివరి నిమిషంలో ప్రయాణం మానుకోవాల్సి వచ్చిన వారికి సెకెండ్ ఛార్ట్ సిద్ధం చేయకముందే టిక్కెట్ కేన్సిల్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

About The Author