ఆయుర్వేదం నందు వ్యాధుల పేర్లు – వాటి లక్షణాలు .
* అండవాతము – అండవృద్ధి – Hydrocele .
వృషణములలో రెండుగాని ఒకటికాని వాపు కలిగి ఉండుట పోటు కలిగియుండుట . వాత ప్రకోపం చేత పొత్తికడుపులో చెడునీరు పుట్టి అది క్రమముగా వృషణాలలోకి దిగి పెరిగెడి రోగం .
* అంతర్వ్రుద్ధి – Hernia .
వాతమును ప్రకోపింపచేయు పదార్దాలు అధికంగా భుజించుట వలన , మలమూత్ర వేగమును నిరోధించుట వలన , అతి బరువు మోయుట వలన వాతం ఎక్కువ అయ్యి సన్నపేగులో ఒక భాగం సంకోచింపచేసి తన స్థానం నుండి క్రిందికి వెడలి గజ్జ యందు చేరి గ్రంథిగా రూపం పొంది వాపును కలిగించు రోగం
* అగ్నిమాంద్యం –
జఠరాగ్ని మందం అయ్యి ఆకలి లేకుండా ఉండుట .
* అతిమూత్రము –
శరీరంలో మేహం అధికం అయ్యి మూత్రం విస్తారంగా పొయ్యే రోగం .
* అతిసారం –
అమితముగా , వికృతముగా విరేచనములు అయ్యే రోగం .
* అనాహం –
మూత్రం బంధించబడి కడుపు ఉబ్బే రోగము .
* అపస్మారం – Hysteria .
స్మృతి లేక నోటి వెంట నురుగు పడటం మొదలగు చిహ్నాలు గల రోగం . మరియు స్త్రీలకు వచ్చెడి కాకిసోమాల అనే మూర్ఛరోగం .
* అభిఘాత జ్వరం –
కర్రలు , రాళ్లు మొదలగు వాటితో దెబ్బలు తగులుట చేత , మన శరీర సామర్ధ్యం కంటే అధికంగా పనిచేయుట వలన , అతిగా దూరం నడుచుట వలన వచ్చెడి జ్వరం .
* అశ్మరీ రోగం – Blader Stones .
మూత్రకోశము నందు రాళ్లు పుట్టుట వలన మూత్రము వెడలుట కష్టం అగు రోగము
* అస్థిగత జ్వరం –
శరీరం నందు ఎల్లప్పుడూ ఉంటూ దేహమును క్షీణింపజేయు జ్వరం.
* అస్రుగ్ధము – Leucorrhoea .
కుసుమరోగము అని కూడా అంటారు . యోని వెంట తెల్లగానైనా , ఎర్రగానైనా , పచ్చగానైనా , నల్లగానైనా జిగటగా నీరు స్రవించెడి రోగము .
* ఆమము –
భుజించెడి పదార్దాలు జీర్ణముగాని కారణంబున గర్భమున జిగురు కలిగి తెల్లగా , బిళ్లలుగా ఘనీభవించెడి దుష్ట జలము.
* ఆమాతిసారము – Dysentery .
ఆమమే విరేచనమయ్యే రోగము . దీనినే జిగట విరేచనాలు అని , ఆమ విరేచనాలు అని అంటారు.
* ఆర్శరోగము – PILES .
మూలవ్యాధి అని అంటారు. గుద స్థానం న లోపల కాని , వెలుపల గాని మాంసపు మొలకలు జనియించి రక్తము స్రవించుచు గాని స్రవించక గాని నొప్పిని కలిగించు రోగము .
* ఆహిక జ్వరం – Intermittent fever .
దినము విడిచి దినము లేక మూడు దినములకు ఒకసారి కాని అప్పుడప్పుడు కనిపించే జ్వరం .
* ఉదర రోగము – Ascites .
శరీరం కృశించుట , తెల్లబారుట , కడుపులో దుష్టపు నీరు చేరి ఉదరము పెరుగుట మొదలగు చిహ్నములు గల రోగము
* ఊపిరిగొట్టు నొప్పి –
గాలి విడిచినప్పుడు గుండెలలో ఒకపక్క పోటు పొడిచినట్టు లేచేడి నొప్పి .
* ఎరుగు వాతము –
కాళ్ళు , చేతులు మొదలగు అవయవములు గాని దేహము అంతయు గాని ఎగురుచుండెడి ఒక విధమైన వాత రోగము .
* కరపాణి కురుపులు –
బిడ్డల యెక్క కాళ్ళమీద , చేతుల మీద దట్టముగా అయ్యేడి కురుపులు .
* కామిల రోగము – కామెర్లు – Jaundice .
కండ్లు , శరీరం , ఆకుపచ్చ లేక పసుపుపచ్చ వర్ణము కలిగి ఆకలి లేకుండా ఉండుట , దాహము , నీరసము మొదలగు లక్షణాలు కలిగి ఉండే రోగము .
* కార్శ రోగము – Emaciation
దేహము నందు ఉండేడి రక్తమాంసములు క్రమక్రమముగా క్షీణించుచూ వుండేడి ఒక రోగము దీనిని ఎండురోగం అని అంటారు.
* క్రిమి రోగము – Intestinal woms .
గర్భమున క్రిములు జనించెడి రోగము .
* గండమాల – Goitre or Scrofuja .
మెడ , మెడ వెనక నరము , మెడ పక్కలనుండి గ్రంధులుగా మొదలు అయ్యి క్రమముగా పక్వము అయ్యి చీము , రసి స్రవించెడి వ్రణములు అనగా గడ్డలు .
* గళ గ్రహము –
స్వరహీనంబై ఆహారాది పదార్ధాలను సులభముగా కంఠం దిగనివ్వకుండా ఉండేడి ఒక శ్లేష్మ రోగము .
* గాయపు సంధి – Tetanus .
కాలి బ్రొటనవేలుకు గాని , చేతి బ్రొటనవేలుకు గాని గాయము తగిలినప్పుడు ,శస్త్ర చికిత్సల యందు దుష్ట క్రిమి ప్రవేశించుట చేత మెడ కొంకులు కుంచించుకు పోయే రోగము .
* గాలి బిళ్లలు – Mumps .
చెవులకు క్రిందుగా వాపు , పోటుతో లేచేడి బిళ్లలు .
* గురదాలు – Kidneys .
వీటిని ఉలవకాయలు అందురు. ఇవి నడుముకి సమముగా లొపల వెన్నునంటి ఉండేడు మాంస గ్రంధులు. వీనివలన మూత్రము జనించును.
* గుల్మము – internel Tumors .
వాత , పిత్త , శ్లేష్మముల దుష్ట స్థితి వలన గర్భము న జనించెడి ద్రవకూటమి .
* గ్రహణి – Dysentry .
కడుపునొప్పి , ఆసనము తీపు కలిగి చీము లేక చీము రక్తము మిశ్రమమై విరేచనములు అయ్యేడి ఒకరకం అయిన అతిసార రోగము .
* చర్ది రోగము – trendency to vomit .
వమన రోగము అని అంటారు. వాంతులు ఎక్కువుగా అవుతాయి .
* చర్మ రోగము –
గజ్జి , చిడుము , పొక్కులు , తామర మొదలగు రోగములు .
* చిట్ల ఫిరంగి – a severe kind of syphilis .
దేహమున నల్లగా స్ఫోటకపు పొక్కుల వలే బయలుదేరేడి సవాయి రోగము .
* జలోదరము – Abdomanal dropsy or Ascitis .
గర్భమున అమితముగా విషపు నీరు పెరిగి పొట్ట నిండు కుండలా ఉండేడి రోగము .
* జిహ్వదోషము – Tongue diesease .
నాలుక ద్రవహీనం అయ్యి ముండ్ల వలే గరుకు కలిగి యే వస్తువు రుచింపకుండా ఉండుట .
* త్రయాహికా జ్వరం – Tertain fever .
మూడు దినములకు ఒకసారి వచ్చెడి చలి జ్వరం .
* నాడి వ్రణము – Guinea worm .
నారీ కురుపులు అనికూడా అంటారు.వీని నుండి తెల్లని దారము వలే నారి బయటకి వెళ్ళును.
* పరిణామ శూల –
ఆహారం జీర్ణం అయ్యే సమయంలో జనించెడి నొప్పి .
* పలల మేహము –
చిన్న చిన్న మాంసపు ముక్కలు మూత్రం వెంట పడే రోగము .
* పక్షవాతము – Paralysis .
శరీరం యొక్క బాగం అనగా ఒకవైపు చెయ్యి , కాలు వీనికి వ్యాపించిన నరములకు సత్తువ లేకుండా చేయు రోగము .
* పాండురోగము – Anemia .
దేహము న రక్తము క్షయించి తెల్లబారి ముఖము , కనురెప్పలు , పాదములు , గుహ్యస్థలము నందు వాపు కలిగి ఉండేడి రోగము .
* పీఠికా మేహము – one type of syphilis .
దేహము అంతా మట్టిపొక్కులుగా లేచేడి మేహరోగము .
* పీనస – Ozoena .
ముక్కువెంట దుర్గంధముతో చీము , రక్తము వెడలె ఒక రోగము .
* ప్లీహారోగము – Enlargement of Spleen .
కడుపులో బల్ల పెరిగి కలిగెడు రోగము.
* పుట్ట వ్రణము – Cancer .
సెలలు వేసే మానని మొండి వ్రణము .
* పురాణ జ్వరం – Chronic Fever .
చాలాకాలం నుంచి ఉండేడి జ్వరం .
* బాలపాప చిన్నెలు – Convulsion of Children .
శిశువులకు 12 సంవత్సరాల లోపున అకస్మాత్తుగా మూర్చవలె కనిపించే రోగము .
* భగందరము – Fistula .
వృషణాలు కు దిగువున , గుదస్థానముకి పైన చిన్న కురుపువలె లేచి అది పగిలి అందులో నుంచి రసి , చీము కారెడి రోగము .
* మూత్రశ్మరీ –
మూత్రపు సంచిలో రాళ్లు పుట్టెడు రోగం .
* మూత్రఘాతం –
మూత్రం బంధించుట . మలమూత్ర , శుక్లములు పొత్తికడుపులో చేరి వికృతిని పొంది ముత్ర నిరోధము కలిగి అందువలన మూత్రం అతికష్టముగా బయటకు వెడలు మేహ రోగము .
* మూత్రకృచ్చం –
మూత్రము బొట్టుబొట్టుగా నొప్పితో వచ్చు రోగము . ఈ రొగికి శుక్లము మూత్రముతో బయటకి వచ్చును.
* మేఘరంజి –
నీటితో కూడిన మేఘము ఆకాశమున కప్పి ఉన్నప్పుడు శ్వాస పీల్చడం కష్టముతో కూడుకుని ఉండు ఒకరకమైన ఉబ్బస రోగము .
* క్షయ రోగము –
ఈ రోగమును ముఖ్యముగా కాస , శ్వాస , కఫము , జ్వరం , దేహము శుష్కించుట , నీరసం , ఏది తిన్నా రుచి లేకుండా ఉండటం , ఆకలి లేకపోవడం ఈ రోగ లక్షణాలు .
* రక్తపైత్యం –
ముక్కువెంట గాని , నోటివెంట గాని అకస్మాత్తుగా రక్తం ప్రవహించెడి రోగము .
* రక్తవాతం –
దీనిని వాత రక్తం అని అంటారు. రక్తం సహజముగా ప్రవహించక దేహమున ఏ భాగం నందు అయినా కూడి వాపు , ఎరుపు , పోటు కలిగి ఉండటం మొదలగు బాధలు కలిగి ఉండు ఒక రోగము .
* రుద్రవాతము –
హఠాత్తుగా మూర్చరోగము వలే స్మారకం లేక పడిపోవడం . నోటివెంట నురుగులు వెడలుట , అంగవైకల్యం కలుగుట ఇలాంటి లక్షణాలు కలిగిన రోగము
* లూతము –
కంటి కోన వద్ద పుట్టెడు రోగము .
* వలీఫలితము –
బాల్యము నందే శరీరం ముడతలు పడుట , వెంట్రుకలు నెరియు వ్యాధి .
* విద్రది –
గర్భము నందు పుట్టి నాభిలోకి వెడలు వ్రణము .
* విషజ్వరము –
ఒకప్పుడు ఉష్ణం అధికంగా ఉండి మరియొకప్పుడు ఉష్ణము లేకుండా ఒక సమయం లేకుండా వచ్చు జ్వరం.
* విసర్పి – Herpes .
ఎర్రగా కాని తెల్లగా కాని పొక్కులు ఒకచోట గుంపుగా లేచి వ్యథతో గూడిన చర్మరోగము . దీనినే సర్పి అందురు.
* శిల్ప కుష్ఠు –
రాళ్లు వలే గరుకుగా గ్రంధులు లేచేడు కుష్ఠు రోగము .
* శూల – Sposmodic colic .
కడుపులోగాని , పక్కలోగాని హటాత్తుగా వచ్చే కఠినమైన నొప్పి.
* శ్వేత కుష్ఠు – Leucoderma .
తెల్లని మచ్చలు బయలుదేరి వ్యాపించెడి కుష్ఠు రోగము .
* స్వరభంగ రోగము –
స్వరము క్షీణించి పోయెడి రోగము లేక గొంతు బొంగురుగా మారి స్వరం పలకని రోగము .
స్థావర విషములు –
పాషాణము , మణిశిల , మైలతుత్తము , గంధకము మొదలగు ఖనిజములు , నాభి , పొత్తిదుంప , గన్నేరు పప్పు , వేరు మొదలగు మూలికలను స్థావర విషములు అంటారు.
జంగమ విషములు –
పాము , తేలు , నక్క , కుక్క మొదలగు జంతువుల కోరల్లో ఉండు విషమును జంగమ విషము అంటారు.
సమాప్తం