పేపర్ కప్స్‌లో టీ తాగితే.. ఆరోగ్యానికి ముప్పే!
డిస్పోజల్ పేపర్ కప్స్‌లో టీ తాగితే ఏంకాదని మనం అనుకుంటాం. కాని ఆరోగ్యానికి అసలుకే ముప్పట. అవి ఎంతమాత్రం సురక్షితం కాదని ఓ అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనాన్ని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఖరగ్‌పూర్ పరిశోధకులు నిర్వహించారు. ఒకరోజులో మూడు డిస్పోజల్ పేపర్ గ్లాస్‌లలో టీ తాగిన వారి శరీరంలోకి 75,000 చిన్న మైక్రోప్లాస్టిక్ కణాలు వెళ్తాయట.
‘పేపర్ కప్స్‌లో టీ పోయడం వల్ల ఆ వేడికి లైనింగ్ కరుగుతుంది. అందులోని మైక్రోప్లాస్టిక్ కణాలు టీ లో కలిసిపోతాయని మా పరిశోధనలో తేలింది. పేపర్ కప్పులు సాధారణంగా పలుచని హైడ్రోఫోబిక్ ఫిల్మ్ పొరతో కప్పబడి ఉంటాయి. ఇవి ఎక్కువగా ప్లాస్టిక్ (పాలిథిలిన్), కొన్నిసార్లు కో పాలిమర్లతో తయారుచేయబడతాయి. పదిహేను నిమిషాల్లో ఈ మైక్రోప్లాస్టిక్ పొర వేడికి కరుగుతుంది.’అని అధ్యయనానికి నేతృత్వం వహించిన ఐఐటీ ఖరగ్‌పూర్‌లోని అసోసియేట్ ప్రొఫెసర్ సుధా గోయెల్ తెలిపారు. ‘ఈ మైక్రోప్లాస్టిక్స్ అయాన్లు పల్లాడియం, క్రోమియం, కాడ్మియంలాంటి విషపూరిత హెవీ లోహాలు. ప్రకృతిలో హైడ్రోఫోబిక్ అయిన సేంద్రియ సమ్మేళనాలు లాంటి వాటికి క్యారియర్లుగా పనిచేస్తాయి. వీటిని తీసుకున్నప్పుడు ఆరోగ్య తీవ్రంగా నష్టం జరుగుతుంది.’ అని ఆమె వివరించారు.