క్షుద్రపూజల ముగ్గు తొక్కడం వల్లనే తల్లితండ్రుల చేతిలో కూతుళ్ళ హత్యల వెనుక నిజం..
క్షుద్రపూజలమీద నమ్మకం , దెయ్యాలంటే భయమే మదనపల్లిలో తల్లితండ్రుల చేతిలో ఇద్దరు కూతుళ్ళ చావుకు కారణమైంది. పోలీసుల రిమాండ్ రిపోర్టులో జంటహత్యలకు దారితీసిన పరిస్థితిని వివరించారు. సాయిదివ్య , అలేఖ్య ఉదయాన్నే కుక్కను తీసుకెళుతూ , మిరపకాయలు , నిమ్మకాయ ఉంచిన ముగ్గు తొక్కారు. సాధారణంగా ఇలాంటి ముగ్గు దిష్టి తీసినప్పుడో , క్షుద్రపూజలసమయంలోనో వేస్తారు. అసలే క్షుద్రపూజలంటే నమ్మకముండే అక్కచెల్లెలిద్దరూ ముగ్గు తొక్కినప్పటినుంచి అనుమానంతో ఉన్నారు. చెల్లెలు సాయిదివ్య తాను ముగ్గుతొక్కానుకాబట్టి తనను దెయ్యం ఆవహించిందని భయపడింది. అక్క అలేఖ్యకూడా అదే నిజమని చెప్పింది. అప్పటినుంచి అక్కచెల్లెళ్లిద్దరూ దెయ్యం సోకిందన్న అనుమానంతో ఉన్నారు., తాను చనిపోతున్నానని సాయిదివ్య కేకలు పెట్టేది. దీంతో 23 వతేదీన మంత్రగాడిని పిలిపించి తాయత్తు కట్టించారు. అప్పటికి సాయిదివ్య తనను దెయ్యంచంపేస్తుందని చెబుతుండేది. తాను చనిపోతానని సాయిదివ్య బిగ్గరగా ఏడుస్తూ కేకలు పెడుతుండగా దెయ్యాన్ని వదిలించాలని తల్లిదండ్రులు వేపకొమ్మలతో కొట్టారు. భయంతో సాయి దివ్య గట్టిగా ఏడవడంతో.. ఈసారి దెయ్యాన్ని వదిలించాలని డంబెల్‌తో తలపై మోదారు. తర్వాత నుదుటిపై కత్తితో కోశారు. అలాచేస్తే ఒంట్లో ఉన్న దెయ్యం పారిపోతుందని చేశారు. దీంతో మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో సాయిదివ్య ప్రాణాలు విడిచింది. దీంతో అక్క అలేఖ్య చనిపోయిన చెల్లిని తిరిగి ఈ లోకానికి తీసుకొస్తానంటూ తల్లిదండ్రులకు చెప్పింది. తన నోట్లో కలశంపెట్టి , తలపై బలంగా కొడితే , తాను పైలోకానికి పోయి చెల్లి ఆత్మను తీసుకొస్తానని చెప్పింది. పెద్ద కూతురు చెప్పినట్టుగానే పురుషోత్తంనాయుడు, పద్మజ కలిసి అలేఖ్య నోటిలో కలశం పెట్టి డంబెల్‌తో తలపై కొట్టారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అలేఖ్య కూడా మరణించింది. అలా మూఢనమ్మకాల ఊబిలో చిక్కుకున్న విద్యాధికుల జీవితాలు ఇలా విషాదాంతం అయ్యాయి..