ఇది సినిమా కథ కాదు.. హత్య వెనక షాకింగ్ నిజం


సంచలనం సృష్టించిన పరవాడ హత్య కేసులో ఆశ్చర్యకరమైన విషయాల్ని బయటపెట్టారు విశాఖ పోలీసులు. రామిరెడ్డి హత్య జరిగిన ఘటనా స్థలంలో దొరికిన చున్నీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. కేసుకు సంబంధించి పూర్తి వివరాలు బయటపెట్టారు. హతుడు రామిరెడ్డి ఓ పెద్ద తప్పు చేశాడు, దానికి ఫలితంగానే హత్యకు గురయ్యాడు.
ఇంతకీ ఏం జరిగిందంటే..గతంలో రామిరెడ్డి ఇంట్లో అతడికి చెల్లెలి వరసైన ఓ అమ్మాయి ఉండేది. వాళ్ల ఇంట్లోనే ఉంటూ దగ్గర్లోని షాపింగ్ మాల్ లో పనిచేస్తూ ఉండేది. ఓసారి ఆమెకు సంబంధించిన ప్రైవేట్ వీడియోను సెల్ ఫోన్ లో రహస్యంగా షూట్ చేశాడు రామిరెడ్డి. అప్పట్నుంచి ఆ వీడియో సాయంతో ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఇది భరించలేక ఆమె ఆ ఇంటి నుంచి వేరే ఇంటికి వెళ్లిపోయింది.
అయినప్పటికీ రామిరెడ్డి తన వరస మార్చుకోలేదు. సెల్ ఫోన్ లో వీడియో ద్వారా ఆమెను బెదిరించడం కొనసాగించాడు. దీంతో విసిగిపోయిన యువతి, తన ప్రియుడు కల్యాణ్ కు ఆ విషయం చెప్పింది. కల్యాణ్ చెప్పిన ప్రకారం.. రామిరెడ్డిని 27వ తేదీ సాయంత్రం రమ్మని చెప్పింది యువతి. అమ్మాయి తన దారిలోకి వచ్చిందని భావించిన రామిరెడ్డి సంబరపడుతూ ఆరోజు సాయంత్రం షాపింగ్ మాల్ కు వెళ్లాడు.
బైక్ పై ఇద్దరూ ఎన్టీపీసీ సమీపంలోని సోమునాయుడుపాలెం ప్రాంతానికి చేరుకున్నారు. గట్టుగా కూర్చుని మాట్లాడుతున్నారు. ఇంతలో వెనక నుంచి వచ్చిన కల్యాణ్, అతడి స్నేహితుడు రామిరెడ్డిపై దాడిచేశారు. కర్రలతో తలపై బాదారు. యువతి చున్నీని మెడకు చుట్టి చంపేశారు. రామిరెడ్డి సెల్ ఫోన్ తీసుకొని ముగ్గురూ పరారయ్యారు.
ఘటనా స్థలం వద్ద దొరికిన చున్నీతో దర్యాపు ప్రారంభించిన పోలీసులు ఈ విషయాలన్నింటినీ వెలుగులోకి తీసుకొచ్చారు. యువతితో పాటు ఆమె ప్రియుడు, అతడి స్నేహితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

About The Author