ఎర్రచందనం ప్రధాన స్మగ్లర్లు ఆచూకీ లభ్యం : డీఎస్పీ వెంకటయ్య


తిరుపతి : సినిమా ఫక్కీలో చేజ్ చేసి పట్టుకున్న నిందితుల ద్వారా ప్రధాన స్మగ్లర్లు ఆచూకీ లభ్య మయినట్లు టాస్క్ ఫోర్స్ డీఎస్పీలు వెంకటయ్య, వివి గిరిధర్ లు తెలిపారు. ఈ సంఘటన లో పట్టుబడ్డ రెండు ఇన్నోవా కార్లు, ఒక మారుతి కారు, మరో మోటారు సైకిల్ ను మంగళవారం ప్రదర్శించారు. ఈ కేసులో ఐతే పల్లి కి చెందిన మునికృష్ణ (34) పలు కేసుల్లో నిందితుడని తెలిపారు. ఇంకా కర్నాటక అనేకల్లు కు చెందిన ఫయాజ్ అహ్మద్ (42), మంజూర్ ఖాన్ (36), మసింఖాన్ (32),ఎన్. చంద్రశేఖర్ (32) లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరిని విచారించడంతో ఎర్రచందనం ను బెంగుళూరులో కొనుగోలు చేసే ఇమ్రాన్ ఖాన్, యాసిన్ ల వివరాలు లభించినట్లు తెలిపారు. వీరి కోసం టీమ్ లను బెంగుళూరుకు పంపనున్నట్లు తెలిపారు. ముని కృష్ణ గత కొన్ని సంవత్సరాలుగా ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నారని చెప్పారు. ఇతని వద్ద ఏడుగురు కూలీలు ఉన్నారని, వారి వివరాలు సేకరించినట్లు తెలిపారు. వారికోసం గాలిస్తున్నామన్నారు. సాహసోపేతంగా చేజ్ చేసి పట్టుకోవడమే కాకుండా, ప్రధాన స్మగ్లర్లు ఆచూకీ కనుగొన్న ఆర్ ఎస్ ఐలు వాసు, సురేష్ టీమ్ లను అనంతపురం రేంజ్ డిఐజి కాంతి రాణా టాటా అభినందించారు. ఈ సమావేశంలో డిఎస్పీ గిరిధర్, సిఐ వెంకట రవి, ఆర్ ఐ భాస్కర్, ఆర్ ఎస్ ఐలు రామమూర్తి, లింగాధర్, డీఆర్వో నరసింహ రావు తదితరులు పాల్గొన్నారు.

About The Author