బీజేపీలో చేరే మాజీ మంత్రులు?
ఏడేళ్ల క్రితం బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏపీలో బలపడాలనే చూస్తోంది. మాటకు వస్తే చాలు చాలా మంది నాయకులు లైన్ లో ఉన్నారని చెప్పడమూ పరిపాటిగానే మారింది.
ఈ మధ్యలో కంభంపాటి హరిబాబు, కన్నా లక్ష్మీనారాయణ ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా వచ్చి వెళ్ళిపోయారు. నాడు బీజేపీలోకి ఎంతమంది చేరారో తెలియదు, కానీ ఇపుడు మాత్రం సోము వీర్రాజు కొత్త ప్రెసిడెంట్ గా వచ్చాడు. మరి సోమొచ్చె మొదలెట్టు అన్నట్లుగా బీజేపీ లో చేరికల కధ సాగుతోంది.
ఏపీలో ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి రాయలసీమ వరకూ మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు పలువులు ఇతర పార్టీల నుంచి వచ్చి చేరుతారంటూ సోము వీర్రాజు తాజాగా బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు.
మరి చూడబోతే విశాఖకే కాదు, ఆంధ్రాకే పెద్ద దిక్కుగా ఉన్న ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం కాబోతోంది. మరో వైపు విశాఖ రైల్వే జోన్ కధ ఏంతో తెలియదు. ఇక ఏపీకి కేంద్ర బడ్జెట్లు వరసగా షాకులే ఇస్తున్నాయి.
ఇవన్నీ కళ్ళ ముందుండగా బీజేపీలోకి మాజీ మంత్రులు చేరుతారు అంటూ సోము వీర్రాజు చెప్పడం ఫక్త్ రాజకీయమేనా అన్న మాట వినిపిస్తోంది. మరి చూడాలి కమలం పువ్వు పట్టుకుని కాషాయం నీడన చేరేవారెవరో.