ఖమ్మం హత్యకేసులో కొత్త కోణం


పెనుబల్లి: ఖమ్మం జిల్లాలో భార్యను హత్య చేసిన భర్త కేసులో మరో కోణం బయటపడింది. నవ్యారెడ్డి హత్యకేసు దర్యాప్తులో ఉండగానే మరో యువతి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. హత్యోదంతం వెలుగులోకి వచ్చిక కొద్దిసేపటికి ఓ యువతి ప్రగళ్లపాడు సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఆ యువతి, నాగశేషురెడ్డి ఇద్దరూ ఒకే గ్రామానికి చెందినవారు. నవ్యా హత్య కేసు దర్యాప్తు జరుగుతుండగానే యువతి ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసుల విచారణలో భాగంగా నిందితుడి ఫోన్‌‌తో పాటు యువతి చరవాణిని స్వాధీనం చేసుకున్నారు. వారిరువురి మధ్య ఉన్న ప్రేమ వ్యవహారం బయటపడుతుందనే భయమే యువతి బలవన్మరణానికి కారణమై ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు.

ఖమ్మం జిల్లాలో జరిగిన దారుణం అందరినీ కలచివేసింది. పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి గ్రామంలో భార్యను భర్త హత్య చేశాడు. పెళ్లిలో రక్షణగా ఉంటానని ప్రమాణం చేసిన కట్టుకున్నవాడే భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. కొత్తలంకపల్లి గ్రామశివారులోని కుక్కలగుట్ట వద్ద ఈ విషాదం చోటు చేసుకుంది. ఎర్రుపాలెం మండలం అయ్యవారిగూడెంకు చెందిన లక్కిరెడ్డి నవ్యారెడ్డి సత్తుపల్లి మండలం గంగారంలో బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. గత ఏడాది డిసెంబర్‌ 9న నవ్యారెడ్డికి ప్రగళ్లపాడుకు చెందిన మేనబావ యరమల నాగశేషురెడ్డితో వివాహమైంది. ఈ నెల 2న కళాశాలకు వెళ్లిన తన భార్య కనిపించడంలేదని 3న ఎర్రుపాలెం పోలీస్‌ స్టేషన్‌లో నాగశేషురెడ్డి ఫిర్యాదు చేశాడు. ఇంతలోనే నవ్యా రెడ్డి చరవాణి నుంచి తండ్రి ఫోన్‌కి సంక్షిప్త సందేశం వచ్చింది. అందులో తనకు పరీక్షల్లో బ్యాక్‌లాగ్స్‌ ఉన్నాయని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఉంది. ఈ సమాచారంతో కుటుంబ సభ్యులు దుఃఖంలో మునిగిపోయారు. అనుమానంతో పోలీసులు చేపట్టిన దర్యాప్తులో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగుచూశాయి. నవ్యా రెడ్డిని భర్తే ఈ నెల 2వ తేదీన స్వయంగా ద్విచక్రవాహనంపై తీసుకువెళ్లినట్లు సీసీ ఫుటేజీ ఆధారంగా గుర్తించారు. నాగశేషురెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా తానే భార్యను హత్య చేసినట్లు అంగీకరించాడు.

About The Author