ఒక్క బదిలీకే అంత ఫ్రస్టేషన్ వస్తే ఎలా..?
నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి ట్రాన్స్ ఫర్ల విషయంపై కోపం వచ్చింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల్ని వారి సాధారణ పదవీ కాలం పూర్తి కాకుండా బదిలీ చేయడానికి వీల్లేదంటూ ఎస్ఈసీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే.. ఎన్నికల పరిశీలకుడిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న బసంత్ కుమార్ ని టీటీడీ జేఈవో స్థానం నుంచి ప్రభుత్వం బదిలీ చేసింది.
ఎన్నికల పరిశీలకుడిగా జిల్లాల్లో ఉండాల్సిన బసంత్ కుమార్, తిరుమల దర్శనానికి వచ్చిన సమయంలో తన గురూజీ నిమ్మగడ్డతో చెట్టపట్టాలేసుకుని తిరగడంతో పాటు, గతంలో ఆయనపై స్థానికంగా వచ్చిన పలు ఆరోపణల కారణంగా ఆ బదిలీ వేటు పడింది. అంతకు ముందే ఆయన్ను జిల్లా కలెక్టర్ గా పంపాలని కూడా నిమ్మగడ్డ ఆదేశించి ఉన్నారు. వాటిని ఖాతరు చేయకుండా ఆయనపై బదిలీ వేటు వేసి, సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది ప్రభుత్వం.
దీంతో నిమ్మగడ్డకు కాలింది. తన శిష్యుడికి కలెక్టర్ పోస్ట్ ఇవ్వాలని సిఫార్సు చేస్తే.. అది చేయకుండా.. ఏకంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా అంటూ బాధపడుతున్నారు. తన అనుమతి లేకుండా బదిలీ చేయడం సరికాదంటూ కొత్త వాదన తెరపైకి తెచ్చారు.
నిమ్మగడ్డ చేసిన బదిలీల సంగతేంటి..?
గతంలో తొలి దఫా ఎన్నికలు వాయిదా వేసిన నిమ్మగడ్డ ఇద్దరు ఐఏఎస్ లు, ఓ ఐపీఎస్ అధికారిపై బదిలీ వేటు వేయాలని ఆర్డర్ ఇచ్చారు. ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు, ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ కి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పట్టుబట్టి మరీ తన బదిలీ ఆజ్ఞలను ప్రభుత్వం పాటించేలా ఒత్తిడి తెచ్చారు.
ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ గోపాల కృష్ణ ద్వివేది విషయంలో ఎంత రాద్దాంతం చేశారో అందరికీ తెలిసిందే. ఆయన సర్వీస్ రిజిస్టర్ లో సైతం రిమార్కులు రాయాలంటూ నానా రాద్ధాంతం చేశారు నిమ్మగడ్డ. మధ్యలో.. ఎన్నికల కమిషన్ లోని ఉద్యోగులపై కూడా వేటు వేసి ఇబ్బంది పెట్టారు. ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఇన్ని బదిలీలు, ఈ స్థాయిలో క్రమశిక్షణ చర్యలు తీసుకున్న ఎస్ఈసీ ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు.
తను చేస్తే మంచి, ప్రభుత్వం చేస్తే తప్పు..
విధుల్ని సక్రమంగా నిర్వర్తించడం లేదనే నెపంతో తాను బదిలీ చేస్తే అది నిఖార్సయిన నిర్ణయం, అదే సిబ్బందిపై ప్రభుత్వం వేటువేస్తే మాత్రం అది పక్షపాతంతో తీసుకున్న నిర్ణయం. ఇలా ఉంది నిమ్మగడ్డ వ్యవహార శైలి. కేవలం బసంత్ కుమార్ అనే అధికారిని ప్రభుత్వం బదిలీ చేసిందన్న నెపంతో.. ఇప్పుడు కొత్తగా మార్గదర్శకాలు జారీ చేశారంటే ఆయనంటే ఈయనకు ఎంత ఇష్టమో అర్థమవుతోంది.
బసంత్ బదిలీని ఆపేయాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చిన ఎస్ఈసీ.. ఇకపై ఎవరినైనా ట్రాన్స్ ఫర్ చేయాలంటే తన అనుమతి తప్పనిసరి అంటూ హుకుం జారీచేశారు, కొత్త మార్గదర్శకాలను విడుదల చేశారు. బదిలీల వ్యవహారంతో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టిన నిమ్మగడ్డ.. ఇప్పుడు ప్రభుత్వం చేసిన ఒకే ఒక్క బదిలీతో ఫ్రస్టేషన్ కి లోనవుతున్నారు.