అమ్మమ్మా క్షమించు…నిందలు భరించలేకే చచ్చిపోతున్నా!
14 ఏళ్ల రేణుకకు తల్లి లేదు. దీంతో ఆ బిడ్డ ఆలనాపాలనను అమ్మమ్మ అనంతమ్మ చూసుకుంటోంది. చదువుపై ప్రేమ పెంచుకున్న రేణుక అర్ధాంతంగా తనువు చాలించాల్సి వచ్చింది. దీనికి ఆమె మనస్తాపం చెందడమే కారణం. అసలేం జరిగిందంటే…
వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలోని జనగాం గ్రామానికి చెందిన సంపంగి వెంకటమ్మ, నర్సింహులు దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో ఇద్దరు మృతి చెందారు. తల్లి వెంకటమ్మ కూడా నాలుగేళ్ల క్రితం చనిపోయారు. దీంతో వారి బిడ్డ రేణుక (14) పెద్దేముల్ మండలంలోని మంబాపూర్‌లో ఉన్న అమ్మమ్మ అనంతమ్మ వద్ద ఉంటోంది. అదే ఊళ్లోని ప్రభుత్వ పాఠశాలలో రేణుక 9వ తరగతి చదువుతోంది.
అయితే రేణుకకు పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు కొంత కాలంగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. తనకు చదువంటే ఇష్టమని, ఉన్నత చదువులు అభ్యసిస్తానని రేణుక చెబుతూ వస్తోంది. అయితే కుటుంబ సభ్యులు బాలిక విజ్ఞప్తిని ఏ మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. దీంతో తనకు పెళ్లి చేయడానికి నిందలు వేస్తున్నారని ఆ బాలిక మనస్తాపానికి గురైంది.
ఈ నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణం చెందింది. ఈ సందర్భంగా ఆ బాలిక రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు చిక్కింది. ఆ నోట్‌లో ఏం రాసిందంటే…
‘అమ్మమ్మా.. నన్ను క్షమించు. నాకు ఇప్పుడే పెళ్లి వద్దు. నేను చదువుకుంటా. నా మాట వినకుండా మీరు సంబంధాలు చూస్తున్నారు. లేనిపోని నిందలు వేస్తున్నారు. నిందలు భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నా’ అని రాసి పెట్టింది. రేణుక సూసైడ్ నోట్ ప్రతి ఒక్కరి హృదయాలను ఆవేదనతో బరువెక్కించింది.