ఉష గరిక పాటి (పింగళి) గారి సాంబార్ పౌడర్


కుఠోలో చూసారుగా అది సాంబార్ పొడి. సాంబార్ పొడికి ఏంటి నీ బిల్డప్ అంటారా అది అలాటిలాటి సాంబార్ పొడి కాదు మరి ?సాంబార్ ప్రిమిక్స్. అదీ సంగతి. మా చిన్నదాని దగ్గరికి విదేశాలకు ఎగరటానికి సిద్ధంగా ఉంది. నిజానికి ఒక్క రోజు కుంచెం కష్టపడి ఎవ్వరైనా ఈ పొడి చేసి పెట్టుకుంటే చాలా ఉపయోగమండోయ్. ఇడ్డెన్లు, గార్లు వేసినరోజు,కూరలుఏవీ లేనపుడు, ఏదన్నా ఊర్లకు వెళ్లి వచ్చినపుడు అలా చాలాసార్లు ఇది మనల్ని ఆదుకుంటుంది. ముఖ్యంగా చాలా ఇళ్లలో దంపతులిద్దరే ఉంటున్న నేటి రోజుల్లో సాంబార్ పెట్టాలంటే ఆలోచించాల్సి వస్తోంది. ఎంత కొద్దిగా చేద్దామని మొదలెట్టినా అన్నీ వేసి చేసేసరికి ఎక్కువే అవుతుంది, నిజానికి, గుప్పెడు పప్పు వండితే సరిగ్గా ఉడకదు కూడా. మిగిలినది ఎవ్వరూ తీసుకెళ్లట్లేదు, దాచి రెండు, మూడు రోజులు తినాలంటే నాబోటి వారికి నచ్చదు. అదే ఈ పొడి ఉందంటే బుల్లి గిన్నెలో గుజ్జనగూళ్లకు వండినట్లు ఐదు నిమిషాల్లో సాంబారు పెట్టుకోవచ్చు. రంగు, రుచి, సువాసన కూడా అమోఘం.
మరి ఈ పొడికి వలయు వస్తుచయము, తయారీ విధానంబెట్టిదనిన
కందిపప్పు ఒక కప్
శనగ పప్పు. అర కప్
బియ్యం పావు కప్
మినప్పప్పు రెండు టీ స్పూన్లు
మెంతులు రెండు టీ స్పూన్లు
ధనియాలు మూడు టేబుల్ స్పూన్లు
మిరియాలు ఒక టీ స్పూన్
ఆవాలు ఒక టీ స్పూన్
ఇంగువపొడి ఒక టీ స్పూన్
పసుపు ఒక టీ స్పూన్
కొబ్బరి పొడి (ఉంటే). రెండు టెబుల్ స్పూన్లు
ఎండుమిరపకాయలు పదిహేను నుండి ఇరవై (తినే కారాన్ని బట్టి )
కడిగి, తడిలేకుండా ఆరబెట్టిన కరివేపాకు గుప్పెడు
ఈనెలు, గింజలు తీసి, పొడిబట్టతో తుడిచిన చింతపండు పెద్ద నిమ్మకాయంత
ముందుగా కందిపప్పు, బియ్యం, శనగపప్పు ఈ మూడింటినీ శుభ్రంగా కడిగి, ఒక నూలుబట్టపైన పరచి, తుడిచి, ఎండపెట్టాలి. ( ఎండ లేని పక్షంలో కడగకుండా బట్టతో శుభ్రంగా తుడుచుకోవాలి, మందులు వేస్తారు కదూ, తుడిస్తే కొంతైనా వదుల్తాయని). తరువాత ఒక బాండీ లో నూనె వేయకుండా ఆ మూడిటిని తడి మొత్తం పోయేలా వేయించి పక్కన పెట్టుకుని (మరీ ఎర్రగా అక్కర్లేదు ), తరువాత అదే బాండీలో ఎండుమిర్చి, మెంతులు, మినప్పప్పు, ఆవాలు, ధనియాలు, మిరియాలు, కరేపాకు ఒకదానితరువాత ఒకటి వేసుకుంటూ నూనె లేకుండా దోరగా వేయించుకోవాలి, ఆఖరులో కొబ్బరి, చింతపండు కూడా వేసి ఒకట్రెండు నిమిషాలు వేయించి, ముందుగా వేయించిన వాటితో కలిపి, అన్నీ చల్లారిన తరువాత మిక్సీలో పొడి చేసుకుని, పసుపు, ఇంగువ కలిపి, పొడిగా ఉన్న డబ్బాలో నింపుకుని, ఫ్రిజ్ లో పెట్టుకుంటే, సాంబార్ పెట్టాలనుకున్నపుడు నీళ్లలో ఈ పొడి వేసి, తగినంత ఉప్పు వేసి, కొత్తిమీర వేసుకుని, మరిగించుకుని, పోపు పెట్టుకుంటే సరిపోతుంది. మనకి కావాలనుకున్న కూరగాయలముక్కలు, ఉడికించుకుని, అందులో ఈ పొడి వేసుకుని పెట్టుకుంటే కూరగాయలతోటీ లేదంటే సాదాగా ఎలా అంటే అలా మనిష్టం అనమాట. (నేనైతే ఆరబెట్టిన కరేపాకు, కొత్తిమీర కూడా పొడిలో వేసి, నిలవచేస్తాను అందుకని సాంబార్ పెట్టినపుడు ఒకవేళ అవి ఇంట్లో లేకపోయినా ఇబ్బంది ఉండదు )

About The Author