చాన‌ళ్ల‌లో ప్ర‌ళ‌యం!


అమెరికా అబద్ధ‌పు ప్ర‌చారానికి తోడు, కొన్ని చాన‌ళ్ల రేటింగ్ పిచ్చి… ప్ర‌జ‌ల్ని భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసేలా క‌థ‌నాలున్నాయి. నిజం కాద‌ని తెలిసినా …పెను ప్ర‌ళ‌యం జ‌ర‌గ‌బోతోందంటూ ఇటీవ‌ల కొన్ని ప్ర‌ముఖ తెలుగు చాన‌ళ్లు ప‌నిగ‌ట్టుకుని త‌ప్పుడు క‌థ‌నాలు ప్ర‌సాద‌రం చేస్తున్నాయి.

భూమి అంతం.. పెను ప్రళయం.. యుగాంతం అంటూ స‌రికొత్త ప్ర‌చారాన్ని తెర‌మీద‌కు తెచ్చారు. వచ్చే నెల్లో భూగోళానికి పెను ముప్పు పొంచి ఉందని అమెరికాలో ఓ అబద్ధపు ప్రచారం మొదలైంది. నిజం గ‌డ‌ప దాటే లోపు, అబ‌ద్ధం లోకాన్ని చుట్టేస్తుంద‌నే సామెత‌ను ఈ యుగాంతం ప్ర‌చారం నిజం చేసింది.

ఇప్పటి వరకు క‌నీవినీ ఎరుగ‌ని పెద్ద ఆస్టరాయిడ్‌(గ్రహశకలం) భూమికి సమీపంలోకి వ‌చ్చే నెల‌లో రానున్నద‌ని, ఈ శకలం భూమిని ఢీకొట్టబోతోందంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోవైపు ఈ ప్ర‌చారంలో ఎంత మాత్రం నిజం లేద‌ని సైంటిస్టులు నెత్తినోరు కొట్టుకుని చెబుతున్నా, అబ‌ద్ధ‌పు ప్ర‌చారం ముందు … వారి వాద‌న తేలిపోతోంది.

మార్చి 21న భారీ ఆస్టరాయిడ్‌(పేరు:2001 ఎఫ్‌ఓ32) భూమికి సమీపంలోకి రానున్నమాట వాస్తవమేనని, కానీ భూమిని ఢీకొట్టడమనేది అబద్ధమని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. ఈ ఆస్టరాయిడ్‌ పలు ఎన్‌ఈఓ (నియర్‌ ఎర్త్‌ ఆబ్జెక్ట్స్‌)ల్లో ఒకటని, ఇవన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయని సైంటిస్టులు విష‌దీక‌రిస్తున్నారు.

ప్రస్తుతం వస్తున్న ఆస్టరాయిడ్‌ వ్యాసార్ధం దాదాపు 2,526–5,577 అడుగులుంటుందని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. మార్చి 21 ఉదయం 11గంటలకు ఈ శకలం భూమికి 13 లక్షల మైళ్ల దగ్గరకు వస్తుంద‌న్నారు. ఈ సమయంలో ఆస్టరాయిడ్‌ గంటకు 76,980 మైళ్ల వేగంతో ప్ర‌యాణిస్తుంటుంది.

భూమికి దగ్గరగా వచ్చిన అనంతరం తిరిగి ఈ గ్రహశకలం తన దారిలో తాను పోతుందని, భూమిని ఢీకొట్టే అవకాశం లేదని పాల్ అనే శాస్త్ర‌వేత్త తెలిపారు. యుగాంతం అనే ప్ర‌చారంలో నిజం లేద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఇవి కేవ‌లం రేటింగ్స్ పెంచుకోవాల‌నే దుష్ట‌ప‌న్నాగంతో చాన‌ళ్ల‌లో సృష్టిస్తున్న ప్ర‌ళ‌యంగా జ‌న‌విజ్ఞాన వేదిక ప్ర‌తినిధులు విమ‌ర్శిస్తున్నారు.

About The Author