రేపు అర్థరాత్రి నుంచి ఫాస్టాగ్ లేకపోతే టోల్ గేటు దాటలేరు..
టోల్ గేట్ వద్ద ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఫీజు చెల్లించే విధానాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే దీని అమలు తేదీని ఎప్పటికప్పుడు పొడిగించుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 15ని తుది గడువుగా నిర్ణయించింది కేంద్రం. అయితే ఈసారి కూడా పొడిగిస్తారనే ఆశ ప్రజల్లో ఉంది.
పొడిగించే ఉద్దేశం లేదు..
ఫాస్టాగ్‌కు సంబంధించిన గడువును పొడిగించేది లేదని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టంచేశారు. వాహన యజమానులు వెంటనే ఫాస్టాగ్‌ను తీసుకోవాలని సూచించారు.టోల్‌ప్లాజాల వద్ద ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఫీజు చెల్లించేందుకు ఉద్దేశించిన ఫాస్టాగ్ విధానాన్ని ఈ నెల 15 అర్ధరాత్రి నుంచి తప్పనిసరి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగ్‌పూర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే రెండు మూడు సార్లు ఫాస్టాగ్ గడువును పొడిగించామన్నారు. ఇకపై గడువు పొడిగించే ఉద్దేశమేదీ లేదని చెప్పారు. గతంలో జనవరి 1గా ఉన్న గడువును ఫిబ్రవరి 15 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.